బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న అనేక ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు ఈవీ రంగంలో దూసుకెళ్తుంటే మన హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ తాను కూడా తగ్గేదె లే అంటుంది. అంతేకాదు, ఏ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ సాధించని రికార్డు తన సొంతం చేసుకుంది. మన నగరానికి చెందిన ఓ ఈవీ స్టార్టప్ బైక్ సాధించిన ఫీట్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఎలక్ట్రిక్ బైక్ స్టార్టప్ గ్రావ్‌టన్ తన ప్రస్థానాన్ని 2016లో మొదలు పెట్టింది.
ఛార్జింగ్ సమస్య లేదు:
నాలుగేళ్ల కఠిన శ్రమ అనంతరం క్వాంటా పేరుతో ఒక ఈవీ బైక్‌ని రూపొందించింది. ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఎలక్ట్రిక్ బైకులన్నీ ఛార్జింగ్ కోసం గంటల తరబడి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఆగాల్సి ఉంటుంది. కానీ, గ్రావ్‌టన్ క్వాంటాకి ఈ సమస్య లేదు. క్వాంటా బైకుని స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీతో గ్రావ్‌టన్ రూపొందించింది. అంటే బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే వెంటనే మరో బ్యాటరినీ అమర్చుకునే వీలు ఈ బైకుకి ఉంది. అయితే ఈ టెక్నాలజీ ఎంత వరకు పని చేస్తుందో.. ఫీల్డ్‌లో వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకునేందుకు ఓ అరుదైన ఫీట్ చేయడానికి గ్రావ్‌టన్ సిద్ధపడింది. అందులో భాగంగా కన్యాకుమారి నుంచి లడఖ్‌లోని కార్‌దుంగ్లా వరకు బైక్ ట్రిప్‌ని ప్లాన్ చేసింది.
ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డు:
2021 సెప్టెంబరు 13న కన్యాకుమారిలో ప్రయాణం మొదలు పెట్టి సెప్టెంబరు 20న కార్‌దుంగ్లాకి చేరుకుంది. ఈ ప్రయాణానికి మొత్తం ఆరున్నర రోజుల సమయం పట్టింది. కన్యాకుమారి నుంచి మనాలీ వరకు 4011 కిలోమీటర్లు ఛార్జింగ్ కోసం ఎక్కడా ఆగకుండా ఏకబిగిన క్వాంటా ప్రయాణించింది. మార్గమధ్యంలో రెస్ట్ తీసుకునే సమయంలోనే బ్యాటరీల ఛార్జింగ్ స్వాపింగ్ పని జరిగింది. ఈ ప్రయాణంలో అన్ని రకాల రోడ్లపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్రోలు బైకుల తరహాలోనే క్వాంటా రైడ్ ఎక్స్‌పీరియన్ష్ ఉందని గ్రావ్‌టన్ తెలిపింది. కేవలం ఆరున్నర రోజుల్లో మొత్తం 4011 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన ఈవీ బైకుగా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లో గ్రావ్‌టన్ క్వాంటా చోటు సాధించింది.
ఫీచర్స్:
ఈ బైక్ ధర రూ.89,999గా ఉంది. దీని బుకింగ్ కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్ చేసిన 3 నెలల కాలంలోపు కస్టమరుకు బైక్ డెలివరీ చేయనున్నారు. ఈ బైకుని సాధారణ చార్జర్ సహాయంతో 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు, అలాగే, ఫాస్ట్ చార్జర్ సహాయంతో 90 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ కానుంది. ఇందులో లిథియం ఐయాన్ బ్యాటరీ ఉపయోగించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్, డిస్క్ బ్రేకులు అమర్చారు. ఇందులో మూడు డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి.