Ola Electric: ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో భాగమైన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ తమ మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాది జూలైలో దేశీ మార్కెట్‌లో తీసుకొని రాబోతున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 400 నగరాల్లో ఒక లక్ష చార్జింగ్ పాయింట్లతో ’హైపర్‌చార్జర్ నెట్‌వర్క్’ను నెలకొల్పడంపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు ఓలా చైర్మన్ భవీష్ అగర్వాల్ తెలిపారు. ‘జూన్ నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. ప్రాథమికంగా 20 లక్షల యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంటుంది. తర్వాత కాలంలో క్రమ క్రమంగా పెంచుకుంటూ వెళ్తాం. జూలై నుంచి అమ్మకాలు మొదలుపెడతాం’ అని ఆయన వివరించారు. అయితే, దీని ధర ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరగాలంటే చార్జింగ్ నెట్‌వర్క్ పటిష్టంగా ఉండటం ముఖ్యం అని అన్నారు. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏర్పాటు చేసే హైపర్‌చార్జర్ నెట్‌వర్క్ ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అత్యంత వేగంగా చార్జ్ చేసుకోవచ్చు అని అగర్వాల్ చెప్పారు. ఈ ఏడాదిలో 100 నగరాల్లో 5,000పైచిలుకు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.(ఇది కూడా చదవండి: ఓలా సంచలనం: సింగిల్ చార్జ్ తో 240 కి.మీ ప్రయాణం)
ఈ స్టేషన్ల ద్వారా ఓలా స్కూటర్‌ను కేవలం 18 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ చేయవచ్చు తెలిపారు. 50 శాతం చార్జింగ్ తో 75 కి.మీ, ఫుల్ ఛార్జింగ్ ద్వారా 200 కి.మీ పైగా దూరం ప్రయాణించవచ్చు అని అగర్వాల్ వివరించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో 0-45 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1.25లక్షలకు తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం వచ్చే అయిదేళ్లలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావచ్చని ఆయన తెలిపారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.