• రూ.1 లక్ష – 1.3 లక్షల మధ్య ధర
  • 181 కిలోమీటర్ల వరకు ప్రయాణం
  • ఎస్‌1, ఎస్‌1 ప్రో మోడల్స్

Ola Electric Scooter: ఎలక్ట్రిక్‌ వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ఆగస్టు 15న మార్కెట్లోకి వచ్చేసింది. ఎలక్ట్రిక్‌ వాహన తయారీలోకి ప్రవేశించిన ఓలా కంపెనీ ఎస్‌1, ఎస్‌1 ప్రో పేరుతో రెండు రకాల స్మార్ట్‌ కనెక్టెడ్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వేరియంట్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఫేమ్‌-2 సబ్సిడీతో కలిపి ఎక్స్‌షోరూం ధర ఎస్‌1 రూ.1 లక్ష ఎస్‌1 ప్రో రూ.1.3 లక్షలుగా ఉంది. కస్టమర్లు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఇచ్చే సబ్సిడీ సైతం పొందవచ్చు. ప్రీ బుకింగ్ చేసిన వినియోగదారులు సెప్టెంబర్ 8 నుంచి డబ్బులు చెల్లిస్తే అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి.

లక్ష ప్రీ బుకింగ్స్ తో ప్రపంచ రికార్డు

కేవలం 24 గంటల్లో లక్ష ప్రీ బుకింగ్స్ తో ఓలా ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసిందే. తన ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆకట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలను మినయించింది. ఓలా తన స్కూటర్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనుభవ కేంద్రాలతో సహా ఓమ్నిఛానల్ మోడల్ ద్వారా విక్రయిస్తుంది. రాబోయే మూడు నెలల్లో ప్రతి నగరంలో ఒక అనుభవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. “భారతదేశంలో మనం టెక్నాలజీని నిర్మించాలి. 2025 నాటికి దేశంలోని అన్ని ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ అయ్యి ఉండాలి. ప్రపంచంలో ఉత్పత్తి చేసే మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో 50 శాతం భారతదేశంలో తయారు చేయాలని మేము కోరుకుంటున్నాము” అని ఓలా చైర్మన్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ తెలిపారు.

181 కిలోమీటర్ల రేంజ్

58 ఎన్‌ఎం టార్క్‌, 3.97 కేడబ్లుహెచ్ బ్యాటరీ, 8 కిలోవాట్‌ పవర్‌ ఔట్ పుట్‌తో హైపర్‌డ్రైవ్‌ మోటార్‌ను ఇందులో తీసుకొచ్చారు. క్రూయిజ్‌ కంట్రోల్‌, సింగిల్‌ పైడెడ్‌ సస్పెన్షన్‌, డిస్క్‌ బ్రేక్స్, 3 జీబీ ర్యామ్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో అంగుళాల థిన్‌ ఫిల్మ్ ట్రాన్సిస్టర్‌ డిస్‌ప్లే ఉంది. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించి 4జీ నావి గేషన్‌, మ్యూజిక్, కాలింగ్‌, వైఫై, బ్లూటూత్‌ వంటి ఫీచర్లను ఆస్వాదించొచ్చు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 121 కిలోమీటర్ల వరకు ఎస్‌1, 181 కిలోమీటర్ల వరకు ఎస్‌1 ప్రో ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. 2.98 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ, టాప్‌ స్పీడ్‌ గంటకు 90 కిలోమీటర్లు ఎస్‌1 ప్రత్యేకత. ఎస్‌1 ప్రో వేరియంట్‌లో 3.97 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ, టాప్‌ స్పీడ్‌ గంటకు 115 కిలోమీటర్లు. ఎస్‌1 నాలుగు రంగుల్లో, ఎస్1 ప్రొ 10 రంగుల్లో లభిస్తాయి.

ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిందే…

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ ఎనర్జీ, సింపుల్ వన్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. సాఫ్ట్ బ్యాంక్ మద్దతుతో యునికార్న్ ఓలా ఎలక్ట్రిక్, 2017లో ఏర్పాటు చేశారు. భారత్‌కు వాహనాలను దిగుమతి చేసే కంపెనీలు దేశీయంగా పెట్టుబడి చేయాల్సిందేనని ఓలా సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ అన్నారు. దిగుమతి వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించాలన్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ డిమాండ్‌పై భవీశ్‌ ఈ విధంగా స్పందించారు. ‘పరిశ్రమలో పోటీ ఉండాలి. సాంకేతికత, తయారీ వ్యవస్థ వృద్ధి చెందాలి. ఏ కంపెనీ అయినా ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడికి భారత్‌ అనువైనది” అని అన్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల మధ్య ఓలా ఎలక్ట్రిక్ ఐరోపా, లాటిన్ అమెరికా, ఆసియాలోని ఇతర ప్రాంతాలతో సహా విదేశీ మార్కెట్లలో ఈ-స్కూటర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అగర్వాల్ తెలిపారు.

ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ

“యూరప్ ప్రజలు ఈవీలు, ద్విచక్ర వాహనాల వైపు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఈవీ మార్కెట్ చాలా వేగంగా అభివృద్ది చెందుతుంది” అని ఆయన అన్నారు. ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో ‘ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ని నిర్మించింది. ఈ ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం 10 మిలియన్ ఈ-స్కూటర్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించడానికి సహకరిస్తుంది. మొదటి దశలో భారతదేశంలో అమ్మడానికి, యూరప్దేశాలకు ఎగుమతి చేయడానికి 2 మిలియన్ ఈ-స్కూటర్లను వచ్చే ఏడాది కాలంలో ఉత్పత్తి చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here