గత కొన్ని ఏళ్లుగా మన దేశంలో చాలా మంది జనాభాకి బ్యాంకు ఖాతా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకో విశేషమేమిటంటే భారతదేశంలో పొదుపు ఖాతా తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. అంటే ఒక వ్యక్తి ఎన్ని పొదుపు ఖాతాలనైనా తెరవవచ్చు. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చో తెలుసుకోవడం ముఖ్యం. అంటే, మీరు ఒక ఏడాదిలో మీ సేవింగ్స్ ఖాతాలో ఎంత వరకు డబ్బును డిపాజిట్ చేయవచ్చు అనేది మనం తెలుసుకోవాలి.
ప్రస్తుతం, ఉన్న నిబందనల ప్రకారం, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, అప్పుడు బ్యాంకులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT)కి తెలియజేస్తాయి. ఒక ఖాతాదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ డబ్బు మూలాన్ని అడగవచ్చు. ఖాతాదారు ప్రతిస్పందనతో సంతృప్తి చెందకపోతే అతనికి నోటీసులు పంపి ఆ డబ్బుపై దర్యాప్తు కూడా చేయవచ్చు.
CBDT దర్యాప్తులో డబ్బు మూలం తప్పు అని తేలితే, ఆదాయపు పన్ను శాఖ డిపాజిట్ చేసిన మొత్తంపై 60% పన్ను, 25% సర్‌ఛార్జ్, 4% సెస్ విధించే అవకాశం ఉంది. ఇక్కడ, మనం ఒక ఏడాదిలో 10 లక్షలకు పైగా నగదు లావాదేవీ చేయలేము అని కాదు. ఈ ఆదాయానికి Source మీ దగ్గర ఉంటే, మీరు చింతించకుండా డబ్బు డిపాజిట్ చేయవచ్చు. అయితే, మీ సేవింగ్స్ అకౌంట్‌లో ఇంత డబ్బు ఉంచే బదులు, ఆ మొత్తాన్ని FDగా మార్చడం లేదా మరెక్కడైనా పెట్టుబడి పెట్టడం మంచిది.