దీపావళి పండుగ సందర్భంగా పెట్రోల్ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.5, డీజిల్ పై లీటరుకు రూ.10 తగ్గిస్తూన్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల పెట్రోల్ వినియోగాన్ని పెంచుతుందని, రైతులు & వ్యాపారాలకు ఇన్ పుట్ ఖర్చులను తగ్గిస్తుందని అందరూ భావిస్తున్నారు. రైతులకు ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి పెట్రోల్, డీజిల్ పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను సమానంగా తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల వినియోగం పెరిగి ద్రవ్యోల్బనం తక్కువగా అవుతుందని, ఇది పేద & మధ్య తరగతులకు సహాయపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. “డీజిల్ పై ఎక్సైజ్ భారీ తగ్గింపు రాబోయే రబీ సీజన్ లో రైతులకు ప్రోత్సాహకరంగా వస్తుంది” అని ప్రకటన తెలిపింది. అయితే, బిజెపి పాలిత రాష్ట్రాలు కొంత మేరకు విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించాయి. మిగతా తెలంగాణ, ఏపీ వంటి ఇతర రాష్ట్రాలు పెంచింది కేంద్రం అయితే, మేము ఎందుకు తగ్గించాలని కేంద్రాన్ని అడుగుతున్నాయి.
కేంద్ర, రాష్ట్రాల పన్ను వాటా
అసలు పెట్రోల్, డీజిల్ పై ఎంత ట్యాక్స్ విధిస్తున్నారో తెలిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కనుగొనలేము. ఈ మధ్య వినిపిస్తున్న ఆసక్తికర విషయం ఏమిటంటే 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారం చేపట్టినప్పుడు 1 బ్యారేల్ పెట్రోల్ ధర 108 డాలర్లు ఉన్నప్పుడు హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.72గా ఉంది. అదే ప్రస్తుతం(దీపావళి) 1 బ్యారేల్ పెట్రోల్ ధర 85 డాలర్లుగా ఉంది. ఈ లెక్కన చూస్తే పెట్రోల్ ధర రూ.50 లేదా రూ.60 రూపాయలకు రావాలి. కానీ, అలా కాకుండా ఇప్పుడు అందుకు రెట్టింపు స్థాయిలో ధరలు ఉన్నాయి. ఎవరు ఎంత పన్నులు వేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
1 బ్యారేల్ క్రూయిడ్ ఆయిల్ ధర = 85.30 డాలర్లు * 74.14 = 6325 రూపాయలు
159 లీటరు క్రూయిడ్ ఆయిల్ ధర = 6325/159 = 39.77 = రూ.40(లిటరుకు)
రవాణా ఖర్చు + రిఫైనరీ ఖర్చు + ఓఎంసీ మార్జిన్ ఖర్చు కలిపితే మొత్తం లీటరుకు = రూ.8.88
మొత్తం= రూ.40 + రూ.8.88 = రూ.48.88
ప్రస్తుతం పెట్రోల్ పై కేంద్రం విధిస్తున్న సుంఖాలు:
అదనపు ఎక్సైజ్ సుంకం(రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్) (లీటరుకు)= రూ.13 (దీపావళికి ముందు రూ.18 ఉండేది)
ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం(లీటరుకు) = రూ.11
వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్(లీటరుకు) = రూ.2.50
కేంద్రం ప్రాథమిక ఎక్సైజ్ సుంకం (లీటరుకు) = రూ.1.40
మొత్తం = రూ. 27.90
కేంద్రం పన్నులు విధించిన తర్వాత పెట్రోల్ ధర = రూ.76.78
పెట్రోల్ మీద డీలర్ మార్జిన్ లీటరుకు = రూ.3.85
మొత్తం = రూ.80.63
తెలంగాణ రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ పన్ను(35.2%) = రూ.27.57
బంకులో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ధర మొత్తం = రూ.108.20 (రూ.80.63 + రూ.27.57)
7 ఏళ్లలో రూ.24 లక్షల కోట్లు
ఇక అసలు విషయానికి వద్దం ఇప్పుడు. కేంద్రం విధిస్తున్న పన్నులలో ప్రాథమిక ఎక్సైజ్ సుంకం(రూ.1.40)లో మాత్రమేరాష్ట్రాలకు వాటా ఇస్తుంది. అంటే రూ.1.40లో సగం రాష్ట్రాలకు వెళ్తుంది. మిగత మొత్తం కేంద్రం ఖజానాలోకి వెళ్తుంది. అంటే లీటరు పెట్రోల్ మీద సుమారు రూ.27 రూపాయలు నేరుగా కేంద్ర ఖజానాలోకి వెళ్తుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రాష్ట్రం వసూలు చేసే వ్యాట్ మొత్తం రాష్ట్ర ఖజానాలోకి వెళ్తుంది. అంటే మనం ఒక లీటరు పెట్రోల్ కొంటే రూ.28 రూపాయలు కేంద్రానికి, రూ.28 రూపాయలు రాష్ట్రానికి వెళ్తుంది.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, పెట్రోల్ మీద ప్రపంచంలో అత్యధిక పన్ను(69%) విధిస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే అది భారత్ మాత్రమే. గత ఏడు ఏళ్లలో పెట్రోల్ మీద వేసే ట్యాక్స్ 459% శాతం పెరిగింది. 2018-2019 ఆర్ధిక సంవత్సరంలో రూ.2.3 లక్షల కోట్ల ఆదాయం కేంద్రానికి వస్తే, 2020-2021 రూ.3.90 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అంటే కరోనా తర్వాత రూ.1.60 లక్షల కోట్ల ఆదాయాన్ని పెట్రోల్,డీజిల్ రూపంలో వసూలు చేస్తుంది. గత ఏడు ఏళ్లలో పెట్రోల్, డీజిల్ విధించే పన్నుల ద్వారా రూ.24 లక్షల కోట్లు ఆర్జించింది.
పెట్రోల్, డీజిల్ జిఎస్టీ పరిదిలోకి వస్తే
అన్నీ వస్తువులను జిఎస్టీ పరిదిలోకి తెచ్చిన కేంద్రం అసలు తేవాల్సిన పెట్రోల్, డీజిల్, న్యాచురల్ గ్యాస్ లను దాని నుంచి మినహాయించింది. అసలు పెట్రోల్, డీజిల్ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొని వస్తాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం పెట్రోల్ మీద రూ.28 రూపాయలు కేంద్రం, రూ.28 రూపాయలు రాష్ట్రం వసూలు చేస్తుంది.
- జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్ వస్తే గరిష్ఠంగా 28శాతం మాత్రమే పన్ను విధించాల్సి వస్తుంది.
- ఇప్పుడు పన్నులు కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించక ముందు లీటర్ పెట్రోల్ ధర రూ.48.80
- రూ.48.88 దీని మీద 28 శాతం మాత్రమే పన్ను విధిస్తే అది రూ.13.68లుగా ఉంటుంది.
- ఇంతకు మించి పన్ను విధించే అవకాశం ఉండదు.
- ఈ రూ.13.68లలో సగం కేంద్రానికి(రూ.6.94 పైసలు), రాష్ట్రానికి(రూ.6.94 పైసలు) వెళ్తుంది.
- జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్ వస్తే గరిష్ఠ ధర రూ.63లుగా ఉంటుంది.
- అంటే కేంద్ర, రాష్ట్రాలు కలిపి రూ.45 నష్టపోవాల్సి వస్తుంది.
- ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్రాలు రూ.5 లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుంది.
అందుకని, ఈ రెండు ప్రభుత్వాలు జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్, న్యాచురల్ గ్యాస్ లను తీసుకొని రావు. అయితే, ఈ పన్నుల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడు ఏళ్లలో రూ.24 లక్షల కోట్లు వసూలు చేశాయి. అంటే, ప్రతి వ్యక్తి నుంచి పన్నుల రూపంలో రూ.20,000 వసూలు చేశాయి. అందుకే అంటారు, ఓటును రూ.1,000లకు అమ్ముకుంటే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం పెట్రోల్, డీజిల్ పన్నుల రూపంలో ఇంత వసూలు చేస్తే, మిగత పన్నుల రూపంలో ఎంత వసూలు చేస్తున్నాయో మీ ఊహకే వదిలేస్తున్నాను.
(చదవండి: ప్రతి రోజు రూ.50 పొదుపు చేస్తే.. రూ.35 లక్షలు మీ సొంతం!)
పెట్రోల్, డీజిల్ పై విధించే పన్నుల వల్ల కలిగే నష్టాలు
- పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
- పాలు, పెరుగు, వంట నూనె, గ్యాస్ సిలిండర్ ధర, ఉప్పు పప్పుల ధర పెరుగుతుంది.
- రైతు కూలీల, మందుల, సాగు ఖర్చు పెరగడం వల్ల గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు పెరుగుతాయి.
- ఇక సగటు ఉద్యోగి జీతం పెట్రోల్ ధరలు పెరిగినంత వేగంగా పెరగాక కొనుగోలు శక్తి పడిపోతుంది.
- బీద, మధ్య తరగతి ప్రజలు కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది.
- ఇంకా ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంది. ఇంకా దేశం అభివృద్ది నెమ్మదిస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే నాయకుడు అంటే పన్నుల ద్వారా వచ్చే అదయంపై ఆర్ధిక వ్యవస్థ నిర్మించుకుండా, రూపాయను సృష్టించి అప్పుడు దాని మీద దేశ, రాష్ట్రాల ఆర్ధిక వ్యస్థలను నిర్మించాలి. ప్రజల మీద ఎంత పన్ను వేస్తే నాయకుడు అంత చేతకానివాడు అని అర్ధం.