LIC_IPO

రాబోయే పబ్లిక్‌ ఇష్యూలో(ఐపీఓ) షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసీ పాలసీదారులు ఫిబ్రవరి 28లోగా తమ పర్మనెంట్‌ అకౌంటు నంబరు (పాన్‌) వివరాలను.. పాలసీ రికార్డులో అప్‌డేట్‌ చేసుకోవాల్సి రానుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిబ్రవరి 13న ఎల్‌ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో సంస్థ ఈ విషయం పేర్కొంది. ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన రెండు వారాలు ముగిసేలోగా పాన్‌ వివరాలను ఎల్‌ఐసీ వద్ద అప్‌డేట్‌ చేసుకోని పాలసీదార్లను..షేర్ల కొనుగోలుగా అర్హులుగా పరిగణించబోమని తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్‌లో నేరుగా లేదా ఏజెంట్ల సహాయంతో అప్‌డేషన్‌ చేసుకోవచ్చని వివరించింది.

డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసే నాటికి, బిడ్‌/ఆఫర్‌ ప్రారంభమయ్యే తేదీ నాటికి ఒకటి లేదా అంతకు మించి పాలసీలు ఉన్న వారు.. పాలసీహోల్డర్‌ రిజర్వేషన్‌ పోర్షన్‌ కింద షేర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులై ఉంటారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం.. ఐపీఓ కింద ఎల్‌ఐసీలో 5% వాటా (31.6 కోట్ల షేర్లు) విక్రయించనుంది. దీని విలువ దాదాపు రూ. 63,000 కోట్లుగా ఉంటుందని, పబ్లిక్‌ ఇష్యూ మార్చిలో ఉంటుందని అంచనా. ఒకవేళ మీ జీవిత భాగస్వామి & మీ పేరిట ఉమ్మడి డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్లయితే(ఇద్దరూ పాల‌సీదారులైనప్పటికి) ఆ జాయింట్ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు ఆఫర్ పొందలేరు.

సెబీ ఐసీడీఆర్ నిబంధనల ప్రకారం.. ఉమ్మడి డీమ్యాట్ ఖాతా గల లబ్ధిదారులలో ప్రాథమిక లబ్ధిదారుడు మాత్రమే రాయితీ పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మొదటి/ప్రాథమిక లబ్ధిదారుని పేరును మాత్రమే ఉపయోగించవచ్చు. ప్రస్తుతం యాన్యుటీలను పొందుతున్న యాన్యుటీ పాలసీదారు(ఇప్పుడు మరణించిన) జీవిత భాగస్వామి ఎల్ఐసీ ఐపీఓలో ఈక్విటీ షేర్లకు దరఖాస్తు చేయడానికి అర్హత కలిగి లేరు. పాలసీదారుడు అతడి/ఆమె పేరిట డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉండాలి. పాలసీదారుడు తన జీవిత భాగస్వామి లేదా కుమారుడు లేదా బంధువు డీమ్యాట్ ఖాతా నుంచి దరఖాస్తు చేసుకోలేరు.