ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అసైన్డ్ ఇంటి లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ ఇంటి స్థలాలపై లబ్ధిదారులకు ఇక నుంచి 10 ఏళ్లకే పూర్తి యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసైన్‌మెంట్ చట్టం(పీఓటీ)-1977కు సవరణ చేస్తూ ప్రతిపాదించిన ఏపీ భూహక్కుల, పట్టాదార్ పాస్ పుస్తకాల (సవరణ) బిల్లు-2021, ఏపీ అసైన్డ్ భూముల (బదిలీల నిషేధం) సవరణ బిల్లు-2021ను అసెంబ్లీ మంగళవారం(నవంబర్ 23) ఆమోదించింది. 2019లో సవరించిన చట్టం ప్రకారం ఇచ్చిన అసైన్డ్ ఇంటి స్థలంపై 20 ఏళ్ల తర్వాతే పేదలకు యాజమాన్య హక్కులు వచ్చేవి. ఈ కాలపరిమితిని పదేళ్లకు కుదిస్తూ సెప్టెంబరు 16న ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు.
(చదవండి: ఉచితంగా కొత్త ఓటర్ ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా..?)
తాజా సవరణ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబరు 16 నాటికే 10 ఏళ్ల గడువు తీరిన అసైన్డ్ ఇంటి స్థలాలపై పేదలకు పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. వాటిపై వారు కొత్తగా భూ యాజమాన్య సర్టిఫికెట్ పొందవచ్చు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడిగా ఇవ్వనున్నారు. అదేసమయంలో, 10 ఏళ్లు గడువు తీరిన అసైన్డ్ ఇంటి స్థలాలను ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే, వాటిని నిర్దిష్ట ధరలకు క్రమబద్ధీకరించనున్నారు. ఈ మేరకు సవరణ బిల్లులో ప్రతిపాదించారు. దీని అమలుపై కటాఫ్ తేదీ, ఇతర ఫీజులను ఖరారు చేస్తూ ప్రత్యేక నిబంధనలు జారీ చేయనున్నారు. ఇటువంటి స్థలాలపై ఎలాంటి అప్పులు, రుణాలు పెండింగ్‌లో లేకుంటే లబ్ధిదారులు వాటిని విక్రయించుకునే అవకాశం ఉంటుంది.