కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ పథకాలలో చేరిన ప్రైవేట్ ఉద్యోగుల కుటుంబాలకు ఆ ఉద్యోగి రోజువారీ వేతనంలో 90 శాతం మొత్తాన్ని కుటుంబానికి ప్రభుత్వం ఫించనుగా అందించున్నట్లు పేర్కొంది . గతేడాది మార్చి 24 నుంచి 2022 మార్చి 24 వరకు ఈ పథకం వర్తిస్తుంది అని తెలిపింది. అలాగే, కోవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఈడీఎల్ఐ పథకం కింద వర్తించే భీమా ప్రయోజనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈడీఎల్ఐ గరిష్ట భీమా మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కనీస భీమా మొత్తాన్ని రూ.2.5 లక్షలుగా పునరుద్ధరించింది. 2020 ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్ల పాటు ఇది వర్తిస్తుంది. సాధారణ, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కూడా లబ్ది చేకూరేలా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేస్తుందని స్పష్టం చేసింది. రాబోయే 3 సంవత్సరాల్లో, అర్హతగల కుటుంబ సభ్యులకు 2021-22 నుంచి 2023-24 సంవత్సరాలలో ఈడీఎల్ఐ ఫండ్ నుంచి రూ.2,185 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.
పీఎం కేర్స్-ఫర్ చిల్డ్రన్ పథకం
కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్-ఫర్ చిల్డ్రన్’ పథకాన్ని కోవిడ్ కారణంగా తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ప్రకటించింది. పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేనాటికి వారి పేరిట రూ.10 లక్షల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఐదేళ్ల పాటు ప్రతీ నెలా వారికి స్టైఫండ్ అందిస్తుంది. పిల్లలకు 23 ఏళ్ల వయసు వచ్చాక ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని వారికి అందిస్తారు.
ఆ మొత్తాన్ని వ్యక్తిగత ఖర్చులకు, చదువులకు లేదా వృత్తిపరమైన అవసరాలకు ఎలాగైనా వాడుకోవచ్చు. అలాగే, ఈ పథకం కింద అనాథ పిల్లలకు ఉచిత విద్య,ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షలు ఆరోగ్య భీమా అందించనున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువుల కోసం తీసుకునే విద్యా రుణాలపై వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. చదువులకు స్కాలర్‌షిప్స్ కూడా అందిస్తుంది.
Support Tech Patashala
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.