Mahila Samman Savings Certificate Scheme: 2023 వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనికి కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్(Mahila Samman Savings Certificate) అని పేరు పెట్టింది. ఇది కేవలం మహిళా ఇన్వెస్టర్లను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం అని కేంద్రం తెలిపింది.
అయితే, ఇప్పటి వరకు ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’(Mahila Samman Savings Certificate) ఖాతాను పోస్టాఫీసుల్లో మాత్రమే తెరిచేందుకు మహిళలకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకంలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
(ఇది కూడా చదవండి: రైతు బంధు పథకానికి ఎవరు అర్హులు.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?)
ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. అలాగే, ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల్లో కూడా ఈ పథకం కోసం మహిళలు ఖాతా తెరవవచ్చు అని తెలిపింది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ఉద్దేశ్యం: ఎక్కువ మంది మహిళలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో తీసుకొచ్చిన వన్-టైమ్ సేవింగ్స్ పథకమే ఇది. ఈ పథకంలో మహిళ తన కోసం లేదా మైనర్ బాలిక పేరిట సంరక్షకుడు ఖాతాను తెరవొచ్చు.
వడ్డీ: ఇది ఒక ప్రభుత్వ హామీ ఉన్న పథకం. దీనిపై 7.5% ఫిక్స్‌డ్ వడ్డీ రేటు లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తం, వడ్డీ కలిపి మీకు ఖాతాలో జమ చేస్తారు.
కాలవ్యవధి: ఈ స్కీమ్ కాలవ్యవధి 2 ఏళ్లు మాత్రమే. ఇందులో 2023, ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు మాత్రమే మదుపు చేయడానికి అవకాశం ఉంది. డిపాజిట్‌ను 2 ఏళ్లు ఉంచితే, ఆ 2 ఏళ్ల సమయానికి వడ్డీ, అసలు కలిపి చెల్లిస్తారు. మెచ్యూరిటీ అనంతరం కూడా డిపాజిట్‌ను ఈ స్కీమ్‌లో ఉంచితే ఆ తర్వాత కాలానికి పొదుపు ఖాతా వడ్డీ మాత్రమే దక్కుతుంది.
డిపాజిట్: ఈ పథకం కింద మినిమమ్ డిపాజిట్ రూ.1000, గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలు. ఒకసారి రూ.2 లక్షల్లోపు డిపాజిట్ చేస్తే మళ్లీ డిపాజిట్ చేయడానికి 3 నెలల వరకు ఆగాల్సి ఉంటుంది.
ఉపసంహరణ: ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత, అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు.
మెచ్యూరిటీకి ముందే ఖాతాను క్లోజ్ చేయవచ్చా?: ఖాతాదారుడు మరణించినప్పుడు ఖాతాను ముందుగానే క్లోజ్ చేసుకొనే అవకాశం ఉంటుంది. ఖాతాదారుడు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సంబంధిత పత్రాలను సమర్పించి ఖాతాను ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు.
ఇలాంటి సమయంలో డిపాజిట్, వడ్డీ కలిపి ఇచ్చేస్తారు. అయితే, ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత ఎటువంటి కారణం చెప్పకుండా ఖాతాను మూసివేస్తే.. ఆ సమయంలో డిపాజిట్ మొత్తం మీద 5.5% వడ్డీ మాత్రమే చెల్లిస్తారు.