కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్లో నూతన భూ సంస్కరణలు చేపట్టింది. ఒకే దేశం – ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ‘ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్’ సాఫ్ట్‌వేర్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(NGDRS)తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్‌లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించడం కేంద్ర ముఖ్య ఉద్దేశ్యం.
“మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ – వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు” సీతారామన్ పేర్కొన్నారు. అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ క్రియేట్ చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహించనున్నారు. దీని ద్వారా దేశంలోని ప్రతీ ప్లాట్‌కు, స్థలానికి, భూమికి 14 అంకెల ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుంది. అంటే ఇది భూమికి తీసుకునే ఆధార్ లాంటిది. ఇక షెడ్యూల్ 8 లోని భూములు ల్యాండ్ రికార్డ్స్‌ను డిజిటల్ పద్ధతిలోకి మార్చడానికి చర్యలు తీసుకొనున్నారు. ఇందుకోసం నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌తో లింకు చేయనున్నారు.