PM KISAN 10th Installment: పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ 10వ విడత నగదు కోసం అర్హులైన లక్షలాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కింద రైతుల ఖాతాలో 10వ విడత రూ.2,000లను 2022 జనవరి 1న జమ చేయనున్నట్లు తాజాగా ఒక మీడియా నివేదిక ధృవీకరించింది. 2022 జనవరి 1న ప్రధాని కిసాన్ పథకం కింద రూ.2,000లను వారి ఖాతాలకు బదిలీ చేస్తామని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ద్వారా సందేశం పంపినట్లు India పోర్టల్ నివేదిక తెలిపింది.
(చదవండి: రైతులకు ఎస్బీఐ శుభవార్త.. తక్కువ వడ్డీకే రుణాలు!)
2022 జనవరి 1న పీఎం కిసాన్ 10వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారని, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఈక్విటీ గ్రాంట్ ను విడుదల చేస్తారని రైతులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. రైతులు pmindiawbcast.nic.in ద్వారా లేదా దూరదర్శన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. గత సంవత్సరం డిసెంబరు 25న ప్రధాన మంత్రి మోదీ పీఎం కిసాన్ 7వ విడత నగదును విడుదల చేసిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి అయిన డిసెంబర్ 25న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ 10 కోట్లకు పైగా లబ్ధిదారు రైతు కుటుంబాలకు రూ.20 వేల కోట్లు బదిలీ చేశారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (ప్రధాని-కిసాన్) పథకాన్ని ప్రధాని మోడీ 2019లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్ధిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. 2 హెక్టార్ల భూమి గల చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.