ప్రధాన మంత్రి కిసాన్ సమాన్ నిధి(పీఎం కిసాన్) పథకం కింద తదుపరి 9వ విడత నగదును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నారు. “రూ.19,500 కోట్లకు పైగా మొత్తాన్ని 9.75 కోట్లకు పైగా లబ్ధిదారు రైతు కుటుంబాలకు బదిలీ చేయనున్నాం. విడుదల సమయంలో లబ్దిదారులతో ప్రధాన మంత్రి సంభాషించనున్నారు” అని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటన విడుదల చేసింది.
ప్రధాన మంత్రి-కిసాన్ పథకం అర్హులైన రైతు కుటుంబాల ఖాతాలో ఏడాదికి రూ.6000 చొప్పున మూడు విడుతలలో విడుదల చేస్తారు. రూ.2000లను నాలుగు నెలలకు ఒకసారి మూడు సమాన వాయిదాలలో పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో కేంద్రం జమ చేస్తుంది. ఇప్పటివరకు ప్రధాని-కిసాన్ పథకం కింద రూ.1.39 లక్షల కోట్లకు పైగా రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకు ముందు మే 14న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 8వ విడుత నగదును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు.