PM Surya Ghar Muft Bijli Yojana Scheme Details in Telugu: దేశంలో రాబోయే విద్యుత్ లోటును తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా పీఎం సూర్య ఘర్ : బిజ్లీ ముఫ్త్ యోజన(PM Surya Ghar: Muft Bijli Yojana) పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
(ఇది కూడా చదవండి: ఓటర్ ID కార్డ్ పోతే డూప్లికేట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా..?)
రూ.76వేల కోట్ల పెట్టుబడితో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి ఇండ్లలో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల్ సీతారామన్ తెలిపారు. ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. కావాల్సిన పత్రాలు ఏమిటి.. ఎవరు అర్హులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎం సూర్య ఘర్ బిజ్లీ ముఫ్త్ యోజన ముఖ్య ఉద్దేశ్యం:
దేశంలో కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా పీఎం సూర్య ఘర్: ముప్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులకు కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ఈ పథకాన్ని రూపొందించారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు(Eligibility):
పీఎం సూర్య ఘర్ యోజన 2024 పథకం కింద ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందాలనుకుంటే.. భారతదేశంలో శాశ్వత నివాసితులు అయ్యి ఉండాలి.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:
- నివాస ధృవీకరణ పత్రం
- ఆధార్ కార్డ్
- విద్యుత్ బిల్లు
- రేషన్ కార్డు
- మొబైల్ నంబర్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
- ఈ-మెయిల్
పీఎం సూర్య ఘర్ యోజన(Apply Online) దరఖాస్తు ప్రక్రియ ఇలా..
- ముందుగా https://pmsuryaghar.gov.in/ పోర్టల్‌లో మీరు పేరును రిజిస్టర్ చేసుకోవాలి.
- దీనికోసం మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీ ఎంచుకొని మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత పోర్టల్‌లో ఉన్న నియమ నిబంధలను అనుగుణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- ఆ తర్వాత కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు సహాయంతో లాగిన్ అవ్వాలి.
- అక్కడ ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం అప్లై చేసుకోవాలి.
- దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి.
- అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల(Empanelled Vendors) నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఇన్‌స్టలేషన్ పూర్తయిన తర్వాత, ఆ ప్లాంట్ వివరాలను పీఎం సూర్య ఘర్ పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు వచ్చి సోలార్ ప్లాంట్ తనిఖీలు చేస్తారు.
- అనంతరం పీఎం సూర్య ఘర్ పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.
- ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు కమిషనింగ్ సర్టిఫికేట్, క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి.
- మీరు అన్నీ వివరాలు సమర్పించిన 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.
స్పెషల్ నోట్: సబ్సిడీ అనేది మీరు ఎంచుకొనే కిలోవాట్ బట్టి మారుతుంది. గరిష్టంగా మీకు లక్ష రూపాయల వరకు రావచ్చు.
3kW సోలార్ ప్లాంట్ కోసం ఎంత విస్తీర్ణం కావాలి?
1kW సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చేసేందుకు కనీసం 12 గజాల (130 Square Feet) స్థలం కావాలి. ఈ ప్రకారం చూస్తే 3kW సోలార్ ప్లాంట్ కోసం 35 గజాల స్థలం అవసరం పడుతుంది.
సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చేసేందుకు లోన్ లభిస్తుందా?
మీరు మీ ఇంటి దగ్గర సోలార్ ప్లాంట్ పెట్టుకునేందుకు బ్యాంకులు రుణం కూడా ఇస్తాయి.