Rythu Bandhu: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో కీలక మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతుబంధు సహాయం అందుతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థికసాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ పథకం అమలులో భాగంగా కీలక మార్పులు చేయాలని చూస్తుంది.
కొత్త సర్కారు రైతుబంధు సాయానికి 5 ఎకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని సమాచారం. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది.
ఐదెకరాల్లోపు వారే 90 శాతం రైతులు..
ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు సంఖ్య 68.99 లక్షల మందికాగా.. ఇందులో అత్యధికంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90శాతానికిపైగా ఐదెకరాలలోపే భూములు ఉన్నాయి. ఐదెకరాలకు పైబడి భూమిన ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే.. కానీ వారి వద్ద ఉన్న భూమి 52 లక్షల ఎకరాలు.