Hyderabad Metro Rail Phase 3 Route Map in Telugu: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌లో ప్రజారవాణాను మెరుగుపర్చేందుకు మెట్రో రైల్‌ను భారీగా విస్తరించాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ జూలై 31న వెల్లడించారు.
రూ.60 వేల కోట్ల ప్రాథమిక అంచనాతో మూడో విడత మెట్రో రైల్ విస్తరణ చేపట్టనున్నామని.. మూడు నాలుగేశ్లలో పూర్తి చేసేలా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ, పురపాలక శాఖలను ఆదేశించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తొలి విడత కింద 70 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు.
(ఇది కూడా చదవండి: Telangana: మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి)
రెండో విడతలో రాయదుర్గం- ఎయిర్‌పోర్టు మధ్య 31 కిలోమీటర్ల మార్గానికి ఇటీవలే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తాజాగా కేటీఆర్ మూడో విడత వివరాలను వెల్లడించారు. మెట్రో రైల్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు కూడా ఇస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్మించాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. 2024 తర్వాత ఎలాగూ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందులో బీఆర్‌ఎస్ పాత్ర కీలకంగా ఉంటుందని… అందువల్ల తప్పకుండా మెట్రోకు నిధులు సాధించుకుంటామనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
మెట్రో రైల్ మార్గాలకు సంబంధించి కేటిఆర్ తెలిపిన వివరాలివీ…
- జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ ఫ్టైఓవర్ తరహాలో మెట్రో రైల్ మార్గం. ఒక లెవల్‌లో వాహనాలు, మరో లెవల్‌లో మెట్రో మార్గం.
- ఆదిలాబాద్-నాగ్‌పూర్ రూట్‌లో ప్యాట్నీ నుంచి కండ్లకోయ ఓఆర్‌ఆర్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మెట్రో రైల్ మార్గం.
- హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్‌లో ఇస్నాపూర్- మియాపూర్ వరకు మెట్రో విస్తరణ
- మియాపూర్ – లక్టీకాపూల్ మధ్య మరో మార్గం నిర్మాణం
- విజయవాడ రూట్‌లో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట్ వరకు మెట్రో విస్తరణ
- వరంగల్ రూట్‌లో ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు విస్తరణ
- భవిష్యత్తులో కొత్తూరు. మీదుగా షాద్‌నగర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం
- ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ దాకా మెట్రో విస్తరణ…
ఇక మెట్రో పార్ట్-బీ విస్తరణ కింద…
ఔటర్ రింగ్ రోడ్డు వెంట నాలుగు కారిడార్లుగా మెట్రోరైల్‌ను విస్తరించనున్నారు. ఇందులో శంషాబాద్-పెద్దఅంబర్‌పేట్ (40కి.మీ), పెద్ద అంబర్‌పేట్-మేడ్చల్ (45కి.మీ), మేడ్చల్-పటాన్‌వెరు (29కి.మీ), పటాన్‌చెరు-నార్సింగి (22కి.మీ) కలిపి మొత్తంగా రూ. 20,810కోట్లతో 186 కిలోమీటర్ల పొడవున మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు.
ఇక బీహెచ్‌ఈఎల్-మియాపూర్-లక్లీకాపూల్ మధ్య 26 కిలోమీటర్లు, నాగోల్-ఎల్బీనగర్ మధ్య 5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ల కోసం రూ.9,100 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నాయని మెట్రోరైల్ ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి వెల్లడించారు. దీనితో కలిపి మొత్తం వ్యయ అంచనా రూ.69,100 కోట్లు అవుతోందని తెలిపారు.
Hyderabad Metro Rail Phase 3 Corridors: కొత్త మెట్రో కారిడార్లు ఇవే..!
- ఓఆర్‌ఆర్ మెట్రో
- జేబీఎస్ నుంచి తూముకుంట
- ప్యాట్నీ నుంచి కండ్లకోయ,
- ఇస్నాపూర్ నుంచి మియాపూర్
- మియాపూర్ నుంచి లక్డికాపుల్
- ఎల్‌బీ నగర్ నుంచి పెద్ద అంబర్‌పేట్
- ఉప్పల్ నుంచి బీబీనగర్
- తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్
- ఎయిర్‌పోర్ట్ నుంచి కందుకూరు (ఫార్మా సిటీ)
- షాద్‌నగర్ మీదుగా శంషాబాద్ (ఎయిర్‌పోర్ట్)