ఈ మధ్య కాలంలో భూములకు సంబంధించి అత్యంత వివాదస్పదంగా మారిన చట్టం ఇదే. భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూములను, ఇండ్ల స్థలాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం ఎంతో కాలంగా ఉన్నదే. ఇందుకు సంబంధించినదే 1977 పీఓటీ చట్టం. ఈ చట్టం కింద ఇచ్చిన భూములకు ప్రభుత్వం కొన్ని షరతులు విధిస్తుంది.
ఆ భూములను ఏ విధంగానూ అన్యాక్రాంతం చేయకూడదు అనేది మొదటి షరతు. అయితే, ఇప్పటి వరకు చాలా వరకు భూములు అన్యాక్రాంతం చేయబడ్డాయి. అలా అన్యాక్రాంతం చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదా తిరిగి భూమిలేని నిరుపేదలకు పంచే అవకాశం ఉంది.
అసైన్డ్ భూమి అంటే ఏమిటి?
భూమిలేని పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్, భూదాన్, ప్రభుత్వ భూములను అసైన్డ్ భూములు అని అంటారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు భూమిలేని పేదలకు భూమిని వ్యవసాయం, ఇంటి స్థలాల కోసం పేదలకు ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నాయి. ఈ భూములను సాగు చేసుకొని పేదరికం నుంచి బయటకు రావాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
కానీ, ఆచరణ విషయానికి వస్తే ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ అసైన్డ్ భూములను పేదలు తమ ఆర్థిక అవసరాల కోసం అమ్ముకున్నారు. చాలా చోట్ల పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపన్నులు, రాజకీయ నాయకులు అక్రమంగా లాక్కున్నారు. దీనిని నిరోధించేందుకు 1977లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధం చట్టాన్ని(1977) (Prohibition of Transfer – POT) తీసుకువచ్చింది.
ఆ భూములకు 1977 వర్తించదు..
ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమిని తదుపరి తరాలు వారసత్వంగా వచ్చిన ఈ భూమిని సాగు చేసుకోవలసిందే కానీ ఎట్టి పరిస్థితులలో అమ్మడం, దానం, లీజుకు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒకవేళ మొదటి సారి బదలాయింపు జరిగితే స్థానిక తహసిల్దార్ ఆ భూమిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తికే తిరిగి అప్పగించాలి.
రెండోసారి కూడా భూమి బదలాయింపు జరిగితే ఆ భూమిని స్వాధీనం చేసుకొని మొదటి వ్యక్తికి ఇవ్వకుండా మరో నిరుపేదకు ఇవ్వాలి. అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తే చెల్లకపోవడమే కాకుండా.. కొనడం కూడా నేరమని కూడా చట్టం చెబుతోంది. ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. 1977 కన్నా ముందు ఎవరైనా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి సాగుచేసుకున్నట్లయితే దానికి పీఓటి చట్టం వర్తించదు.
అసైన్డ్ భూములను పట్టా భూములగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
ఏపీలో 1954లో జూన్ 18న జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేదలకు అందచేసిన భూములను బదిలీ చేయకూడదని షరతు పెట్టింది. అయితే ఈ నిబంధన అమలులోకి రాకముందు ఇచ్చిన అసైన్డ్ పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదు.
వీటిని పదేళ్ల తర్వాత నిషిద్ధ జాబితా నుంచి తప్పించాల్సి ఉన్నా మార్పు జరగడం లేదు. దీనిపై కోర్టు కూడా స్పందించి ఏపీలో 1954 కన్నా ముందు ఉన్న అసైన్డ్ భూములను పట్టా భూములగా మార్చుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది.
ఇక తెలంగాణలో జమీందారులు/రాజులు తమకు అందించిన సేవలకు గుర్తుగా భూములను కొందరికి కేటాయించారు. వీటిని ఇనాం(గిఫ్ట్) భూములుగా పేర్కొంటున్నారు. 1956 చట్టాన్ని అనుసరించి మంజూరుచేసిన రైత్వారీ పట్టాలను నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలి. తెలంగాణలో కూడా 1956 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగి ఉన్న రైతులు తర్వాత వాటిని పట్టా భూములుగా మార్చుకోవచ్చు.
అసైన్డ్ భూములను ఎప్పుడూ కోనవచ్చు?
ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పట్టాలనే అసైన్డ్, డిఫార్మ్, లావోని, డికెటీ పట్టాలని అంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఆరు లక్షల ఎకరాల సీలింగ్ మిగులు భూములను పేదలకు పంచారు. పేదలకు ఇచ్చిన భూములు వారి స్వాధీనంలో ఎక్కువకాలం ఉండటం లేదు. అందుకే, పేదలకు ఇచ్చిన భూముల రక్షణ కోసం 70వ దశకంలో కేంద్రం ఒక ముసాయిదా చట్టం రూపొందించి అన్నీ రాష్ట్రాలకు పంపింది.
దాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సైతం 1977లో అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టాన్ని పీఓటీ లేదా 9/77 చట్టం అని అంటారు. ఈ చట్టం మేరకు అసైన్డ్ భూముల బదలాయింపు చెల్లదు.
పేదలకు ఇచ్చిన భూములను రెండూ ప్రత్యేక సందర్భాలలో కొనుగోలు చేయవచ్చు. 1977 పీఓటీ చట్టం సెక్షన్ 2 ప్రకారం 1.011715 హెక్టార్ల కన్నా(రెండున్నర ఎకరాలు) తక్కువ మాగాణి(తరీ) భూమి లేదా 2.023430( ఐదు ఎకరాలు) కన్నా తక్కువ భూమి గల రైతు అది అసైన్డ్ భూము అని తెలియకుండా కొన్న తర్వాత దానిని అతని పేరు మీదకు మార్చుకునే అవకాశం ఉంది.
అయితే, అతని పేరు మీదకు వచ్చిన తర్వాత కూడా దానికి అసైన్డ్ భూములకు ఉన్న షరతులు వర్తిస్తాయి. అయితే, ఈ భూములను తెలంగాణలో అయితే 2017 కొనుగోలు చేసి ఉండాలి. ఏపీలో అయితే 2007 కంటే ముందు ఈ భూములు కొన్న రైతులు తమ పేరు మీద మార్చుకునే అవకాశం ఉంది.
అలాగే, మరో సందర్భంలో అసైన్డ్ భూముల కొనుగోలు చేయవచ్చు. 1977 పీఓటీ చట్టం సెక్షన్ 6 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సహకార బ్యాంకులు లేదా వ్యవసాయ అభివృద్ది బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వారి అవసరాల నిమిత్తం తనఖా పెట్టి ఆర్ధిక అవసరాల కోసం డబ్బులు తీసుకొన్న తర్వాత తిరిగి చెల్లించాలి.
ఒకవేల గనుక ఆ నగదు తిరిగి చెల్లించకపోతే ఆ బ్యాక్ వేలం వేసే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వం పేర్కొన్న బ్యాంకులు వేలం వేసిన సందర్భంలో గనుక భూమి కొనుగోలు చేసినట్లయితే మీరు పట్టా భూమిగా అది రూపాంతరం చెందుతుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో అసైన్డ్ భూములను కొనుగోలు చేయవచ్చు.
Support Tech Patashala
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.