EPF Advance For Marriage: మనకు ఎప్పుడు ఎలాంటి ఆర్ధిక అవసరాలు వెంటాడుతాయో చెప్పలేము. ఇలాంటి సందర్భంలో ప్రతి ఉద్యోగికి గుర్తుకు వచ్చేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. మనకు కొన్ని క్లిష్ట సమయాలలో ఆర్థిక పరిస్థితులు తలెత్తినప్పుడు ఈపీఎఫ్ఓ ఖాతాలో నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది అనే విషయం అతి కొద్ది మాత్రమే తెలుసు.
(ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయండి ఇలా..?)
అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ అడ్వాన్స్‌లు నాన్-రిఫండబుల్. కనుక ఈపీఎఫ్ మెంబర్లు తమ అవసరాలకు అనుగుణంగా.. చాలా జాగ్రత్తగా ఈపీఎఫ్ అడ్వాన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోండిలా?
How To Apply For EPF Advance: ఉద్యోగులు ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం.. ఫారమ్ 31ని తమ యజమానికి (కంపెనీ యాజమాన్యానికి) సమర్పించాలి. అప్పుడు మీ కంపెనీ లేదా యాజమాన్యం మీ దరఖాస్తును ధ్రువీకరించి.. ఆమోదం కోసం ‘ఈపీఎఫ్ఓ’కు సమర్పించడం జరుగుతుంది. ఈపీఎఫ్ఓ కనుక మీ అభ్యర్థనను ఆమోదిస్తే.. అడ్వాన్స్ సొమ్ము మీ బ్యాంక్ ఖాతాలో పడుతుంది.
ఎలాంటి సమయాలలో ఈపీఎఫ్ అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు?
- ఆరోగ్య అత్యవసర పరిస్థితి(Medical Emergency)
- విద్య(Education)
- వివాహం(Marriage)
- భూమి కొనుగోలు (Land Purchase)
- గృహాన్ని పునరుద్ధరించడం(Home Renovation)
- నిరుద్యోగిత(Unemployed)
ఉద్యోగుల ఆరోగ్యం బాగాలేనప్పుడు చికిత్స కోసం, పిల్లల విద్య కోసం, పెళ్లి చేసుకునేటప్పుడు, భూమి కొనుగోలు చేసినప్పుడు, గృహ నిర్మాణం లేదా పునరుద్ధరణ కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగులు కొన్ని సార్లు జాబ్ నుంచి తొలగించబడిన లేదా మానేసిన సందర్భాల్లో.. ఆయా వ్యక్తులు తమ ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందడానికి అర్హులు అవుతారు.
ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం కావాల్సిన అర్హతలు, షరతులు?
- ఉద్యోగులకు పెళ్లి కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ కావాలంటే.. సదరు వ్యక్తి ఈపీఎఫ్ఓ మెంబర్‌గా 7 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది.
- స్వయంగా ఉద్యోగి వివాహం చేసుకుంటే ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు. ఉద్యోగి కొడుకు లేదా కూతురు పెళ్లి కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఉద్యోగి సోదరుడు లేదా సోదరి మ్యారేజ్ కోసం కూడా అడ్వాన్స్ తీసుకోవచ్చు.
- వివాహం కోసం, విద్య కోసం 3 సార్లు కంటే మించి ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవడానికి వీలుపడదు.
- ఒక్కో అవసరానికి ఒక్కో నియమం ఉంటుంది.. వాటి గురుంచి మీరు పోర్టల్లో తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఎంత ఇస్తారు?
ఈపీఎఫ్ అకౌంట్లో ఉద్యోగి కొంత మొత్తం, యాజమాని కొంత మొత్తం సొమ్మును జమ చేస్తారు అనే విషయం మనకు తెలుసు. దీనిలో ఉద్యోగి చెల్లించిన మొత్తం సహా, దానిపై అప్పటి వరకు వచ్చిన వడ్డీలో 50% సొమ్మును.. పెళ్లి కోసం అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు.