Property Purchase – Precautions Tips: ఈ సృష్టిలో ఎప్పటికీ విలువ కోల్పోని ఆస్తి ఉంది అంటే అది ఒక భూమి మాత్రమే. సాధారణంగా ఏదైనా ఒక ఆస్తికి విలువ తగ్గుతూ, పెరుగుతూ వస్తుంది. కానీ, భూమికి మాత్రమే పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. ముఖ్యంగా జనాభా పెరుగుతున్న కొద్దీ భూములకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది.
అందుకే, ఎప్పటికైనా మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉండటంతో ప్రస్తుతం చాలా మంది వ్యవసాయ భూమిపై(Agricultural Land) పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి విలువైన ఆస్తి విషయంలో కొన్ని సమస్యలు ఎక్కువగా ఎదురు అవుతున్నాయి. వీటికి ముఖ్యకారణం భూముల కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన అంశాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం.
(ఇది కూడా చదవండి: భూ పహాణీ, అడంగళ్/పహాణీ, ఖాస్రా పహాణీ అంటే ఏమిటి? వాటి కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)
ఈ సమస్యలకు ప్రధాన కారణం కొనుగోలు చేసే భూములు ఏ రకమైన భూములో తెలుసుకోకపోవడం. భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు ఉంటాయి.. ఏ రకమై న భూములు కొనుగోలు చేయాలి… ప్రభుత్వ భూమికి, ప్రైవేట్ భూమికి తేడా ఏమిటి? వంటి అనేక అంశాలపై పెద్దగా అవగాహన లేకపోవడం. అందుకే మనం ఈ కథనంలో భూమిని కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
భూమి కొనేముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
- మీకు భూమి అమ్మే వ్యక్తి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి.
- రెవెన్యూ రికార్డులలో భూమి అమ్మే వ్యక్తి పేరు ఉందో లేదో తెలుసుకోవాలి.
- ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో తన పేరు ఉందో లేదో తెలుసుకోవాలి.
- మీరు కొనే భూమికి సంబంధించి గత 30 ఏళ్ల ఖాస్రా పహాణీ, సేత్వార్(డైగ్లాట్) చరిత్ర తెలుసుకోవాలి.
- మీకు భూమి అమ్మే వ్యక్తికి ఆ భూమి ఎలా సంక్రమించింది అనేది తెలుసుకోవాలి.
- ఆస్తి లావాదేవీలను ట్రాక్ చేయడానికి పాత డాక్యుమెంట్స్ సేకరించాలి, మునుపటి భూ యజమానుల గురించి సమాచారాన్ని తెలుసుకోవాలి.
- భూమి కొనేటప్పుడు డబ్బులను బ్యాంకు లేదా చెక్ ద్వారా చెల్లించండం మంచిది.
- భూమి కొనేముందు భూమి ఏమి రకం అనేది తప్పకుండా తెలుసుకోవాలి.
భూములు ఎన్ని రకాలు?
- గ్రామ కంఠం భూమి
- ప్రభుత్వ భూములు/అసైన్డ్‌భూమి:
- పొరంబోకు భూములు
- బంచరాయి భూములు
- ప్రైవేట్ భూములు
- ఇనాం భూములు
- అగ్రహారం భూములు
- సర్ఫేఖాస్ భూములు
గ్రామ కంఠం భూమి అంటే ఏమిటి?
గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.
ప్రభుత్వ భూములు/అసైన్డ్‌భూమి అంటే ఏమిటి?
భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని ప్రభుత్వ భూమి లేదా అసైన్డ్‌భూమి అంటారు. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం చేయకూడదు. మీరు ఇలాంటి భూమిలను కొనకపోవడం చాలా మంచిది.
పొరంబోకు భూములు అంటే ఏమిటి?
భూములు సర్వే చేసే నాటికి సేద్యానికి ఉపయోగపడకుండా ఉండి ఉంటే అలాంటి భూములను పొరంబోకు భూములు అంటారు. ఇది కూడా ప్రభుత్వ భూమి అని తెలుసుకోవాలి. ఈ భూములను కొనకపోవడం చాలా మంచిది.
బంజరు భూమి(బంచరాయి) అంటే ఏమిటి?
రెవెన్యూ గ్రామ శివారులో ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని బంజరు భూమి అంటారు. గ్రామ అవసరాల కోసం మొత్తం భూమిలో కొంత శాతాన్ని బంజరు భూమిగా ఉంచాలనే నిర్ణయం గతంలో ఉండేది. కొండలు, గుట్టలు, ఖనిజ సంపద ఉన్న భూములను కూడా బంజరు భూములుగా వర్గీకరించి ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంటుంది.
ప్రైవేట్ భూములు అంటే ఏమిటి?
తర తరాలుగా పట్టా అని రాసి, ప్రజలు అనుభవిస్తున్న భూములను ప్రైవేట్ భూములు అంటారు. (భూమి రికార్డుల్లో వీరు పేరు ఉంటుంది). ఇలాంటి భూముల మీద చాలా తక్కువ సమస్యలు ఉంటాయి.
ఇనాం భూములు అంటే ఏమిటి?
రాజుల కాలంలో రాజుకు ప్రత్యేక సేవలు చేసినందుకు ఆ వ్యక్తికి ఇచ్చిన భూములను ఇనాం భూములు అంటారు. 1950 తర్వాత వచ్చిన ఇనాం రద్దు చట్టాలతో పట్టా భూముల కిందనే చూడవచ్చు.
అగ్రహారం భూములు అంటే ఏమిటి?
పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.
సర్ఫేఖాస్ భూములు అంటే ఏమిటి?
సర్ఫ్-ఎ-ఖాస్ అంటే వ్యక్తిగత వ్యయం అని అర్థం. నిజాం రాజు సొంత ఖర్చుల నిమిత్తం కేటాయించిన భూమిని సర్ఫ్-ఎ-ఖాస్ (సర్ఫేఖాస్) భూమి అంటారు.