What is Inam-Lands
What is Inam-Lands in Telugu

What is Inam Lands in Telugu ఇనాం భూములు(Inam Lands) అంటే ఏమిటి?: ఈ మధ్య కాలంలో రెండూ తెలుగు రాష్ట్రాలలో భూ చట్టాలకు సంబందించి అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కొత్త చట్టాల వల్ల ప్రతి వ్యక్తి భూ చట్టాలకు సంబందించిన పదాల గురుంచి తెలుసుకోవాల్సి వస్తుంది.

అందులో చాలా ముఖ్యమైనవి ఇనాం భూములు(Inam Lands), పుంజ భూములు, లావుని పట్టా, అడంగల్ వంటి పదాల గురుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనం ద్వారా ఇనాం భూములు గురుంచి తెలుసుకుందాం.

    ఇనాం భూములు(Inam Lands) అంటే ఏమిటి?

    పూర్వం మన దేశాన్ని రాజులు, చక్రవర్తులు, నిజాం ప్రభువులు వంటి జాగీర్ దార్లు లేదా సంస్థానాధీశులు తమకు అందించిన సేవలకు గాను కొన్నిసార్లు వారి వారి అర్హతలను అనుసరించి కొంతమందికి భూములను గ్రాంటుగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వారికి ఇచ్చిన భూములను ఇనాం భూములు(Inam Lands) అని అంటారు.

    ఇనాం భూముల(Inam Lands)ను తెలంగాణలో 1955లో, ఆంధ్రలో 1956 రద్దు చేస్తూ భూ చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలను అనుసరించి తెలంగాణ ప్రాంతంలో ఓఆర్‌సి సర్టిఫికెట్‌, ఆంధ్ర ప్రాంతంలో రైత్వారీ పట్టా ఇచ్చారు. అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల భూములు సెటిల్ కాలేదని గతంలో కోనేరు రంగారావు కమిటీ నివేదిక తేల్చింది.

    సాధారణంగా గ్రామంలో వివిధ సేవలందించినందుకు గాను ,ప్రతిభావంతులైన కళాకారులకు, కవులు, రచయితలకు, సంగీత విద్వాంసులు, నటులు చిత్రకారులు మొదలగు వారికి వారి ప్రతిభాపాటవాలను గుర్తిస్తూ భూములు గ్రాంట్ లేదా దానంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన భూములనే ఇనాం భూములు(Inam Lands) అని అంటారు.

    ఇనాం భూములు(Inam Lands) కొనుగోలు చేయవచ్చా?

    ఇనాం భూములు(Inam Lands) అనుభవించుటకు గాని, అన్యాక్రాంతం చేయుటకు వీలు లేదు. ఇనాం భూములు(Inam Lands) రద్దు తర్వాత చట్టప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని రైతులు రైతు వారి పట్టా, తెలంగాణ ప్రాంతంలోని ఇనాం భూముల రైతులు ఓఆర్‌సి సర్టిఫికెట్‌ పొందవచ్చును, అప్పుడు ఆ రైతులకు సర్వహక్కులు వస్తాయి.

    (ఇది కూడా చదవండి: What is Sadabainama: సాదాబైనామా అంటే ఏమిటి?)

    తెలంగాణ ప్రాంతం చట్టం 1955, ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర ఏరియా ఇనామ్ రద్దు మరియు రైత్వావారిగా మార్పు చట్టం 1956 సెక్షన్ 10 బి ప్రకారం ఈనామ్ దారు తన భూమిని అప్పటి విలువ ప్రకారం పూర్తి క్రయధనము పొంది మరొకరికి విక్రయించినట్లు అయితే ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తినే ఇనాందార్ గా పరిగణించి ఓఆర్‌సి/ రైత్వారి పట్టా మంజూరు చేస్తారు. ప్రస్తుత చట్టాల ప్రకారం వీటి విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

    ఇనాం భూములు(Inam Lands)కు పట్టా వస్తుందా?

    ఇనాం భూములకు పట్టాలు పొందవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ ఇనామ్ రద్దు చట్టం 1955 ప్రకారం.. ఆంధ్రప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ ఇనామ్ రద్దు మరియు రైత్వారిగా మార్పు చట్టం ప్రకారం అర్హులైన వారికి ఇనాం భూములకు పట్టాలు మంజూరు చేస్తారు.

    ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదా ఓఆర్‌సి(ORC) సర్టిఫికెట్‌ అంటే ఏమిటి?

    ఓఆర్‌సి సర్టిఫికెట్‌ అంటే తెలంగాణ ప్రాంతంలో ఇనాం భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన వారికి ఆంధ్ర ప్రదేశ్ ఇనామ్ భూముల రద్దు తెలంగాణ ప్రాంతం చట్టం 1955 ప్రకారం ఫారం 3లో జారీచేసే స్వాధీన హక్కు పత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదా ఓఆర్‌సి సర్టిఫికెట్‌ అంటారు.

    ఇనాం భూములను అమ్ముకోవచ్చా?

    ఇనాం భూములను అనుభవించాలి కానీ అమ్ముకోరాదు. ఇనాం భూములకు పట్టా పొందిన తర్వాత భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయి. కాబట్టి ఇనాం భూములకు పట్టా పొందిన తరువాత వాటిని అమ్ముకునే అవకాశం ఉంది.

    (ఇది కూడా చదవండి: What is Sadabainama: సాదాబైనామా అంటే ఏమిటి?)

    ఇనాం భూముల పట్టా ఎవరెవరికి ఇస్తారు.?

    ఆంధ్రప్రాంతంలో ఇనాం దారులకు కౌలుదారులకు సెక్షన్ 4 ప్రకారం నిర్ణయించి రైత్వారీ పట్టా జారీ చేసేవారు. ఒకవేళ 7 -1 -1948 నాటికి కౌలుదారు అనుభవంలో ఉన్నట్లు నిర్ధారణ జరిగితే ఒకటి బై మూడోవంతు భూమిపై ఇనాం దారులకు రెండు బై మూడోవంతు భూమికి గాను కౌలుదారులకు పట్టా మంజూరు చేసేవారు.

    ఒకవేళ ఇనాం భూమి ఏదైనా సంస్థకు చెందినదైతే ఈ విభజన నియమం వర్తించదు. అదే తెలంగాణ ప్రాంతంలో అయితే ఇనాం దారులకు శాశ్వత కౌలుదారులకు రక్షిత కౌలుదారులకు పట్టా వస్తుంది.