తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చెయ్యడానికి ప్రతి ఒక్కరు ఎంచుకునే ప్రధాన మార్గం రైలు ప్రయాణం. ఎంతో సులువుగా ప్రశాంతంగా తక్కువ ఖర్చుతో ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో రైలు రావాల్సిన సమయం కంటే కొన్ని గంటలు ఆలస్యంగా రావడం గురించి మనకు తెలిసిందే. సాధారణంగా ఒక రైలు కేవలం తనకు కేటాయించిన రైల్వే స్టేషన్లలోనే ఆగుతుంది. మిగతా ఎక్కడా కూడా అది ఆగడానికి అవకాశం లేదు.
నేను ఇటీవల గమనించిన దీనికి సంబందించిన ఒక సంఘటన గురుంచి మీతో పంచుకుంటాను. గత మార్చి 14న సికింద్రాబాద్ నుంచి ఖమ్మం ఒక రైలులో ప్రయాణం చేస్తున్నాను. మార్గం మద్యలో రైలు జనగాం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ఒక జంట తమ 10 ఏళ్ల కూతురు రైలు ఎక్కలేదని చైన్ లాగి రైలును ఆపారు. ఇలాంటి ప్రత్యేక సమయంలో రైలు ఒక నిమిషం ఆగడం వల్ల రైల్వే సంస్థకు ఎంత భారీ నష్టం కలుగుతుందో మీకు తెలుసా?.
కదిలే రైలు ఎలాంటి కారణం లేదా పైన చెప్పిన సందర్భంలో ఆగాల్సి వస్తే రైల్వే సంస్థకు భారీ నష్టం సంభవిస్తుంది. ఆర్‌టీఐ సమాచారం ప్రకారం.. డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైలు ఒక్క నిమిషం ఆగడం వల్ల రూ.20,401 నష్టం కలిగితే అదే ఎలక్ట్రిక్ రైలు అయితే రూ.20,459 నష్టం వాటిల్లుతుంది. అలాగే గూడ్స్ రైలు విషయానికి వస్తే.. డీజిల్ రైలు ఒక నిమిషం ఆగితే రూ.13,334, ఎలక్ట్రిక్ రైలు అయితే రూ.13,392 నష్టం కలుగుతుంది.
కదులుతున్న రైలు మార్గం మధ్యలో ఎలాంటి కారణం చేత ఆగిపోవడం వల్ల మళ్లీ రైలు ఇంతకముందు వేగాన్ని అందుకోవడానికి కనీసం 3 నిమిషాల సమయం పడుతుంది. ఇటువంటి సమయంలో డీజిల్ లేదంటే ఎలక్ట్రిసిటీకి ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే, దీని వెనుక వచ్చే రైళ్లను కూడా ఆపాల్సి వస్తుంది. దీని వల్ల ఎంత నష్టం వస్తుందో మీరే ఊహించండి. కొన్ని రైళ్లు ఆలస్యం అయితే ప్యాసింజర్లకు మళ్లీ డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్క రైలు అకారణంగా ఒక్క నిమిషం ఆగితే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని సరైన కారణం లేకుండా ఎప్పుడు రైలును ఆపడానికి ప్రయత్నించకండి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.