Evaru Meelo Kotishwarulu

బుల్లితెరలో రియాలిటీ షోగా మంచి సక్సెస్ అందుకున్న షో మీలో ఎవరు కోటీశ్వరుడు.. ఇప్పటికే పలు సీజన్లు పూర్తి కాగా గత కొంత కాలంగా జెమినీలో ఎవరు మీలో కోటీశ్వరులుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈసారి ఎవరు మీలో కోటీశ్వరులు షోకు యంగ్ హీరో ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్నారు. ఈ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. సుజాతనగర్‌ మండలానికి చెందిన బి.రాజారవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది.

రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్‌ఎస్‌ రాజు-శేషుకుమారి దంపతుల కుమారుడు రాజారవీంద్ర. తను కొంతకాలంగా డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఈ రియాలిటీ షోలో పాల్గొన్న ఆయన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూ.కోటికి సంబంధించిన ప్రశ్న అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ రవీంద్రను అడగ్గా.. సమాధానం చెప్పి ఫిక్స్‌ చేయండి అంటూ రవీంద్ర మాట్లాడిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఎపిసోడ్‌ ప్రసారం కావాల్సి ఉండగా.. రవీంద్ర నగదు గెలుచుకున్నారా లేదా అనే విషయాన్ని షో నిర్వాహకులు ధ్రువీకరించాల్సి ఉంది.

(చదవండి: ఒక్కరోజులో కోటీశ్వరులైన పేటీఎం ఉద్యోగులు)