రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఆర్ధికంగా చేయూత అందించడం కోసం రెండు సందర్భాల్లో భూములిస్తుంది. ఒకటి వ్యవసాయం కోసం, రెండు ఇళ్లు కట్టుకునేందుకు. ఈ అసైన్‌మెంట్ భూములను తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు కానీ అమ్మడం లేదా మరే విధంగానూ ఇతరులకు బదలాయింపు చేయడానికి వీల్లేదు. అయితే, ఇలాంటి భూములకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఓటీ చట్టంలోనే కొన్ని మినహాయింపులిచ్చాయి. 1977లో వచ్చిన చట్టంలో ఇప్పటి వరకు 11 రకాల వెసులుబాట్లు కల్పించారు.
అసైన్డ్ భూముల అమ్ముకోవచ్చా?
అసైన్డ్ పట్టాలో అమ్మకూడదు అనే నిబంధన పేర్కొనకపోతే, భూమిలేని నిరుపేదలు ఎవరైనా 1977 కంటే ముందు కనుక అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ఉంటే అమ్ముకోవచ్చు. అలాగే, 1977 పీఓటీ చట్టం సెక్షన్ 2 ప్రకారం 1.011715 హెక్టార్ల కన్నా(రెండున్నర ఎకరాలు) తక్కువ మాగాణి(తరీ) భూమి లేదా 2.023430( ఐదు ఎకరాలు) కన్నా తక్కువ భూమి గల రైతు అది అసైన్డ్ భూము అని తెలియకుండా కొన్న తర్వాత దానిని అతని పేరు మీదకు మార్చుకునే అవకాశం ఉంది. అయితే, అతని పేరు మీదకు వచ్చిన తర్వాత కూడా దానికి అసైన్డ్ భూములకు ఉన్న షరతులు వర్తిస్తాయి. అయితే, ఈ భూములను తెలంగాణలో అయితే 2017 డిసెంబర్ 31 కంటే ముందు కొనుగోలు చేసి ఉండాలి. ఏపీలో అయితే 2007 కంటే ముందు ఈ భూములు కొన్న రైతులు తమ పేరు మీద మార్చుకునే అవకాశం ఉంది.
అలాగే, మరో సందర్భంలో అసైన్డ్ భూముల కొనుగోలు చేయవచ్చు. 1977 పీఓటీ చట్టం సెక్షన్ 6 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సహకార బ్యాంకులు లేదా వ్యవసాయ అభివృద్ది బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వారి అవసరాల నిమిత్తం తనఖా పెట్టి ఆర్ధిక అవసరాల కోసం డబ్బులు తీసుకొన్న తర్వాత తిరిగి చెల్లించాలి. ఒకవేల గనుక ఆ నగదు తిరిగి చెల్లించకపోతే ఆ బ్యాక్ వేలం వేసే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వం పేర్కొన్న బ్యాంకులు వేలం వేసిన సందర్భంలో గనుక భూమి కొనుగోలు చేసినట్లయితే మీరు పట్టా భూమిగా అది రూపాంతరం చెందుతుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో అసైన్డ్ భూములను కొనుగోలు చేయవచ్చు.
ఇంకా మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు భూములిస్తే వాళ్లు పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాజకీయ బాధితులైతే పట్టా చేతికి వచ్చిన మరుక్షణమే అమ్ముకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించిన వారికి అసైన్ చేస్తారు. వారికి ఫామ్-జీ పట్టాలిస్తారు. అవి పట్టాభూములే. వాటిని తక్షణమే అమ్ముకోవచ్చు. 1977 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్‌లో, 2017 వరకు తెలంగాణలో ఎవరైనా పేదలు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే కొన్న వారికి మళ్లీ అసైన్‌మెంట్ పట్టా ఇవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి స్థలాల కోసం ఇచ్చిన పట్టా భూములను 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. 2019 జనవరి కంటే ముందు అమ్ముకుని ఉంటే క్రమబద్ధీకరించుకోవచ్చు. అలాగే, రక్తసంబంధీకులకు దానం కానీ వీలునామా రూపంలో కానీ ఇవ్వవచ్చు. వారసుల పేరిట పట్టా మార్పిడి చేయొచ్చు.
చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
అసైన్డ్ భూములను చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. సివిల్ చర్యల కింద వారిని ఆ భూమి నుంచి తొలగించి ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుంది. పీవోటీ చట్టం సెక్షన్-7 ప్రకారం తహసీల్దార్ క్రిమినల్ కేసు (కొనుగోలు చేసిన వారిపై, అడ్డుపడిన వారిపై) పెట్టవచ్చు.
అసైన్డ్ భూములను ప్రభుత్వం తన విచక్షణతో స్వాధీనం చేసుకోవచ్చా?నష్టపరిహారం ఇస్తారా?
అసైన్‌పట్టాను పరిశీలిస్తే ‘ప్రభుత్వానికి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది’ అనే నిబంధన ఉంటుంది. దీని ప్రాతిపదికగా చాలా సందర్భాల్లో అసైన్ భూములను ప్రభుత్వం తీసుకుంది. ఏ ఉద్దేశం కోసమైతే ప్రభుత్వం అసైన్ చేస్తుందో మూడేళ్లలో ఆ ఉద్దేశం నెరవేరకపోతే తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అసైనీనే ప్రభుత్వానికి భూమిని సమర్పించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటే 1992 వరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఎకరానికి కంటితుడుపుగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారు. రెండు నెలల క్రితం వచ్చిన కోర్టు తీర్పుల ప్రకారం కూడా ఏ విధంగా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకున్నా పరిహారం ఇవ్వాల్సిందే. పట్టా భూములకు ఎంత చెల్లిస్తారో అంత చెల్లించాల్సిందే. భూమి హక్కులకు ఉల్లంఘన జరిగితే ఎన్నేళ్ల తర్వాత వచ్చి అడిగినా పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.