Vacant Land Tax Full Details in Telugu: మనం ఇప్పటి వరకు గృహ పన్ను, వాణిజ్య పన్ను, ఆస్తి పన్ను వంటి చాలా రకాల పన్నులను తెలుసుకునే ఉంటాము. కానీ, ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి తెలిసిన ‘ఖాళీ స్థలాలపై పన్ను’ (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) గురించి మీకు తెలుసా?, ఒకవేళ మీకు ఆ పన్ను గురించి తెలియకపోతే మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఏమిటి(What is Vacant Land Tax)?
మనం వేరే వ్యక్తి నుంచి భూమి కొన్నతర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణం చేపట్టకపోతే ఖాళీగా ఉన్న భూమి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నునే ‘ఖాళీ స్థలాలపై పన్ను(వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్-Vacant Land Tax) అని అంటారు. ఈ టాక్స్ అనేది ఆయా ప్రాంత బట్టి మారుతూ ఉంటుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.
(ఇది కూడా చదవండి: Property Tax in Telangana: ఆస్తి పన్ను అంటే ఏమిటి? తెలంగాణలో ఆస్తి పన్ను ఎంతో తెలుసా..!)
నిర్మాణాలకు అనువైన/ నిర్మాణాలు అనుమతించదగిన ఖాళీ స్థలాలపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 సెక్షన్ 94(ఏ) పేర్కొంటోందని, ఆయా ప్లాట్లపై ఈ మేరకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు (జీహెచ్‌ఎంసీ మినహా), మున్సిపాలిటీల కమిషనర్లను గతంలో పురపాలక శాఖ డైరెక్టరేట్ ఆదేశించింది.
లేఅవుట్ల అప్రూవల్స్ జారీ/ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించే సమయంలో సంబంధిత ఖాళీ స్థలాల మదింపు (అసెస్‌మెంట్) చేసే సమయంలో ఈ పన్ను విధించాలని కోరింది.
వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏ విధంగా లెక్కిస్తారు(How To Caliculate Vacant Land Tax)?
యూఎల్బీ పరిధిలో ఉన్న ఖాళీ భూములపై కొన్ని ప్రమాణాల ఆధారంగా పన్ను విధిస్తారు. ఖాళీ స్థలాలను గుర్తించి, నిర్దిష్ట ఖాళీ భూమి యజమానిపై యుఎల్ బి రెవెన్యూ విభాగం విధించే ఖాళీ భూమి పన్ను(వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ )ను నిర్ణయించడానికి మదింపు చేస్తారు.
ఖాళీ స్థలాలపై పన్ను శాతం ఎంతో తెలుసా?
ఖాళీ స్థలాలపై ప్రభుత్వం విధించే పన్ను అనేది మీరు భూమి కొన్న విలువలో 0.5 శాతం వరకు ఉంటుంది.
ఖాళీగా ఉన్న భూమిపై పన్ను చెల్లించాలా?
రెండు తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం వంటి ప్రధాన నగరాలలోని ప్రజలు ఖాళీగా ఉన్న భూమిలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగతా నగరాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పన్నులు వసూలు చేస్తారు.
తెలంగాణలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎంతో తెలుసా?
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ విలువలో 0.05 శాతానికి తగ్గకుండా, 0.20 శాతానికి మించకుండా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని తెలంగాణ మున్సిపాలిటీల ఆస్తి పన్నుల నిబంధనలు–2020 చెబుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఖాళీ స్థలాలపై పన్ను ఎంతో తెలుసా?
ఆంధ్ర ప్రదేశ్‌లో ఖాళీ స్థలాలపై పన్ను అనేది ప్రభుత్వ మార్కెట్ ధరలో 0.54 శాతం మేర ప్రతి ఏడాది పన్ను చెల్లించాల్సిందే. అంటే సెంటు మార్కెట్ ధర రూ.లక్షగా ఉందనుకుంటే ఖాళీ స్థలానికి పన్ను రూపంలో అక్షరాల రూ.540 చెల్లించాలి.
తెలంగాణలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎంత చెల్లించాలో తెలుసుకోవడం ఎలా?
- ఖాళీ స్థలాలపై పన్ను ఉన్నదో తెలుసుకోవడం కోసం ముందు ప్రభుత్వ అధికారిక https://cdma.cgg.gov.in/cdma_arbs/CDMA_VLT/VLTMenu పోర్టల్ ఓపెన్ చేయాలి.
- ఇప్పుడు మీ జిల్లా ఎంచుకోవాలి
- ఆ తర్వాత యుఎల్బి రెవెన్యూ విభాగం ఎంచుకోవాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత VLTIN NO, Name of Owner, Door No నమోదు చేసి ఎంత చెల్లించాలో తెలుసుకోవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్‌లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎంత చెల్లించాలో తెలుసుకోవడం ఎలా?
- ఖాళీ స్థలాలపై పన్ను ఉన్నదో తెలుసుకోవడం కోసం ముందు ప్రభుత్వ అధికారిక https://cdma.ap.gov.in/en/knowyourpt పోర్టల్ ఓపెన్ చేయాలి.
- ఇప్పుడు మీ జిల్లా ఎంచుకోవాలి
- ఆ తర్వాత మున్సిపల్, కార్పొరేషన్ ఎంచుకొని సబ్మిట్ నొక్కండి.
- ఆ తర్వాత Assessment Number, Old Assessment Number, Owner Name, Door Number, నమోదు చేసి ఎంత చెల్లించాలో తెలుసుకోవచ్చు.