PM-KISAN: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకువచ్చింది. అప్పటి నుంచి దీని కింద అర్హత కలిగిన ప్రతి రైతులకు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలు బ్యాంక్ ఖాతాల్లోకి వేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొంత మంది రైతులు అర్హత లేకున్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని గుర్తించింది. ఈ సంఖ్య దాదాపు 33 లక్షల మంది అనర్హులుగా ఉన్నారని తేలింది. ఇక వీరికి మోదీ ఇస్తున్న రూ.6,000 ఇక రావు అన్నమాట.(ఇది చదవండి: రైతుబంధు 5 ఏకరాలకే ఇస్తే ఖజానాకు రూ.4,500 కోట్లు మిగులు)
‘పీఎం-కిసాన్’ పథకం ద్వారా నగదును పొందిన అనర్హులైన రైతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్ నిధి యోజన నిబంధనలను పాటించని 33 లక్షల మంది అనర్హులైన రైతులకు దాదాపు 2500 కోట్ల రూపాయలు చెల్లించాయి. ఇప్పుడు, ఈ అర్హత లేని వారి నుంచి తక్షణం రికవరీ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అనర్హులైన రైతుల నుంచి రికవరీని త్వరలో ప్రారంభించవచ్చు. పీఎం కిసాన్ వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో 32,91,152 మంది భోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు.(ఇది చదవండి: వ్యవసాయ భూములపై సీఎం కేసీఆర్ ఆసక్తికర ప్రకటన)
పీఎం-కిసాన్ నగదును ఈ రైతుల బ్యాంకు ఖాతాలకు కూడా బదిలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కు జత చేసిన ఆధార్, పాన్ నంబర్లను తనిఖీ సమయంలో కొన్ని లక్షల మంది రైతులు ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని గుర్తించింది. పీఎం కిసాన్ నిబందనల ప్రకారం అటువంటి వారికి పీఎం కిసాన్ వర్తించదు. అలాగే ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగాలు, పెన్షనర్లు కూడా ఈ ప్రయోజనాలు పొందుతున్నట్లు గుర్తించారు. ఇప్పుడు అలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ దిశగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి.
అనర్హుల జాబితాలో ఎక్కువ శాతం మంది తమిళనాడులో (6.96 లక్షల) ఉన్నారు. ఇక పంజాబ్ లో 4.70 లక్షల మంది, కర్ణాటకలో 2.04 లక్షల మంది, ఉత్తరప్రదేశ్ లో 1.78 లక్షలు మంది, రాజస్థాన్ లో 1.32 లక్షల మంది, హర్యానాలో 35 వేల మంది, గుజరాత్ లో ఏడు వేలకు పైగా బోగస్ లబ్ధిదారులు ఉన్నారు. మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా? రావా? అని కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా:
- మొదట మీరు Home (pmkisan.gov.in) పోర్టల్ కు వెళ్లాలి.
- ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి.
- తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.