What is No Cost EMI: ప్రస్తుతం మన దేశంలో పండుగ సీజన్ల ఆఫర్ల జాతర కొనసాగుతుంది. అన్ని ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ప్లాట్ పారాల్లో పెద్ద ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రజలు వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, కొనుగోలు సమయంలో తమపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు చాలా మంది ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటున్నారు.
సాధారణంగా ఈఎంఐ అంటే మనం చెల్లించాల్సిన మొత్తం సొమ్ముని వడ్డీతో సులభ వాయిదాలలో చెల్లించడం అని మనకు తెలుసు. అయితే ఇటీవల కాలంలో అన్ని బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ అనే ఆప్షన్ కూడా అందిస్తున్నాయి.
ఇందులో వడ్డీ ఏమి ఉండకపోవడంతో వస్తువులు కొనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే అసలు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి? దీని ద్వారా వస్తువులు తీసుకోవడం లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నో-కాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి?
నో-కాస్ట్ ఈఎంఐని సున్నా-వడ్డీ ఈఎంఐ అని కూడా పిలుస్తారు. మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎలాంటి వడ్డీ చార్జీలు లేకుండా వాయిదాలలో చెల్లించవచ్చు. సంప్రదాయ ఈఎంఐల వలే కాకుండా, మీరు నిర్దిష్ట కాలవ్యవధిలో వడ్డీ లేకుండా చెల్లించాల్సి ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ అనేది మీరు కొనుగోలు చేసే వస్తువు అసలు ధరను సమాన వాయిదాలలో చెల్లించవచ్చు.
(ఇది కూడా చదవండి: ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకుండా ఎంత బంగారం కొనవచ్చో మీకు తెలుసా?)
ఉదాహరణకు, మీరు రూ. 24,000 విలువైన మొబైల్ ఫోన్‌ని కొనుగోలు చేసి.. ఆ మొబైల్ ధరను ముందస్తుగా చెల్లించలేని పక్షంలో.. మీరు నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా 3 నుంచి 12, 18 నెలల పాటు నెలకు రూ. 2,000 చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు మొబైల్ కొనుగోలు చేసిన డబ్బులను సౌకర్యవంతంగా, ఒత్తిడి లేకుండా మీ మీద వడ్డీ భారం పడకుండా చెల్లించవచ్చు.
ప్రాసెసింగ్ ఫీజులు..
మీరు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కింద వస్తువులు కొనేటప్పుడు నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అనేది ప్రతి బ్యాంకును బట్టి మారుతుంటుంది. సాధారణంగా మీరు కొనుగోలు చేసే వస్తువు మొత్తంలో ఇది 2-3 శాతం ఉంటుంది.
అలాగే, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే స్పెషల్ డిస్కౌంట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్ అసలు ధర రూ. 20,000 అయితే, వన్-టైమ్ పేమెంట్ ఎంచుకుంటే 10% డిస్కౌంట్ లభించడం వల్ల మీకు రూ.18,000 ఖర్చవుతుంది. అయితే, అదే నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకుంటే మీరు పూర్తి రూ. 20,000 చెల్లించాల్సి రావొచ్చు.
నో కాస్ట్ ఈఎంఐ లాభమా, నష్టమా?
నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకునే ముందు మీ అవసరాలు, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తి ధరను పరిశీలించాల్సి ఉంటుంది. ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు నో-కాస్ట్ ఈఎంఐలు లాభదాయకంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకోవాలి..
మీరు కొనుగోలు చేసే వస్తువు ధర అధికంగా ఉంటే.. దాని కోసం ముందస్తుగా చెల్లించడం మీకు ఆర్థిక భారం అయితే నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకోవడం ఒక మంచి ఆప్షన్.
ఏ సమయంలో ఈ ఆప్షన్ ఎంచుకోవద్దు..
మీరు మీ ఆర్థిక ఇబ్బందులను లేకుండా ఒకేసారి చెల్లించగలిగితే, నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకోకపోవడమే మంచిది. దీనివల్ల భవిష్యత్ వాయిదాల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.