Tata Curvv Electric Car: ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు శుభవార్త. ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కు చెందిన టాటా మోటార్స్ టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఆయా మోడల్స్ తో పలు రకాల ఈవీ కార్లు మార్కెట్ లోకి విడుదలవ్వుతున్నా.. సంప్రదాయ ఇంధన వాహనాల నుంచి ఈవీల వైపు మొగ్గు చూపేందుకు ఇప్పటికీ పలువురు వాహనదారులు ఇష్టపడడం లేదు.
అందుకు ప్రధాన కారణం కారు రేంజ్, బ్యాటరీ లైఫ్, ఎంత వరకు సేప్టీ అని తెలుస్తోంది. ఈ తరుణంలో టాటా గ్రూప్ విడుదల చేసిన టాటా కర్వ్ ఈవీ వాహనదారుల అనుమానాల్ని పటాపంచలు చేస్తోందంటూ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స తెలిపారు. ఈ కారు వాహనదారుల అపోహల్ని తొలగిస్తుందని ధీమాగా చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ వెహికల్ పై ఉన్న అపోహలు ఏంటి?
ఎలక్ట్రిక్ కార్ల పనితీరుపై అనేక అపోహలున్నాయి. ముఖ్యంగా కష్టతరమైన ప్రాంతాల్లో ఈవీ వెహికల్స్ ప్రయాణం కష్టంతో కూడుకున్న పని అని మనో చాలా మంది అనుకుంటారు. దీంతో పాటు ఎక్కువ దూరం ఈవీ వెహికల్స్ వెళ్లలేవని, అందుకే ఇంధన వెహికల్స్ నుంచి ఈవీ వెహికల్స్ వైపుకు రాకపోవడానికి ఇదే కారణమని శ్రీవత్స్ తెలిపారు. కానీ టాటా కర్వ్ రియల్ టైమ్ రేంజ్ 400 ప్లస్ కిలోమీటర్లు. కానీ 400- 425 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించవచ్చు.
ఈవీ ఛార్జర్ పాయింట్లు అందుబాటులో లేకపోవడం?
మార్కెట్ లోని డిమాండ్ కు అనుగుణంగా ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం అంతగా లేకపోవడంపై వాహనదారులు ఈవీ కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడడం లేదు. టాటా కంపెనీ మాత్రం ప్రైవేట్ ఛార్జింగ్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నాం. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుతున్నట్లు శ్రీవల్స్ వెల్లడించారు.
ఈవీ బ్యాటరీలు ఎంతకాలం పనిచేస్తాయి?
ఈవీ బ్యాటరీ ఖర్చుతో కూడుకున్నది. బ్యాటరీని రీప్లేస్ చేయవలసి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని తరచుగా వినియోగదారులను ఆందోళనకు గురిచేసే ప్రశ్న. సాధారణంగా ఈవీ బ్యాటరీలను వినియోగించి 7-10 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. భారత్ లో ఇప్పటి వరకు వాహనదారులు లక్షలోపే ప్రయాణిస్తున్నారు. బ్యాటరీ లైఫ్ సైకిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, మొత్తం బ్యాటరీని మార్చాల్సిన అవసరం లేదని ఆయన పునరుద్ఘాటించారు.
ఈవీ కారు ధర:
ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటు ధరల్లో లభ్యమైతే బాగుంటుందని ప్రతి ఒక్క కొనుగోలు దారుడు భావిస్తారు. వారి అంచనాలకు అనుగుణంగా టాటా కర్వ్ అందుబాటు ధరలకే లభ్యమవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉందని అన్నారు.