CIBIL Score Improve Tips in Telugu: ప్రస్తుత ఆధునిక యుగంలో అప్పులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే, గతంతో పోలిస్తే ఇప్పుడు అప్పు ఇచ్చే బ్యాంకులు కూడా పెరిగిపోతున్నాయి. అయితే మనకు అప్పు ఇవ్వడానికి ప్రధానంగా మన Credit Score చూస్తాయి. ఇలాంటి క్రెడిట్ స్కోరు అనేది మీ ఆర్థిక ఆరోగ్యం, బాధ్యతకూ ప్రతిబింబం.
(ఇది కూడా చదవండి: No-Cost EMI: నో కాస్ట్ ఈఎంఐతో లాభమా? నష్టమా? ఎప్పుడు నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకోవాలి..?)
ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల ఈ స్కోరు తగ్గొచ్చు. ఇలాంటప్పుడు మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్లీ మంచి స్కోరును సాధించేందుకు కొన్ని సూత్రాలు పాటిస్తే చాలు. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉండటానికి కారణం తీసుకున్న రుణాలకు వాయిదాలను, క్రెడిట్ కార్డు బిల్లులను గడువు లోపు చెల్లించకపోవడమే.
రుణాలను తిరిగి చెల్లించడం:
తక్కువగా ఉన్న స్కోరును మెరుగుపర్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.. రుణ వాయిదా బాకీలను సకాలంలో తీర్చేయడమే. అధిక సంఖ్యలో రుణాలు, క్రెడిట్ కార్డులు ఉంటే.. వాటన్నింటినీ ఒకే దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నించండి. ఒకవేల మీరు మూడు నెలలకు మించి రుణం చెల్లించకపోతే బ్యాంకులు ఆ అప్పును ఎన్‌పీఏ(NPA)గా మారుస్తాయి.
రుణం నికర ఆదాయం:
రుణం అనేది మీ నికర ఆదాయంలో 30శాతానికి మించకుండా వాయిదాలుండాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోరు పెరుగుతూ వస్తుంది. వాయిదాలను ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించండి.
రుణం తీసుకునేటప్పుడు జాగ్రత్త:
అవసరం లేకున్నా అప్పు తీసుకోవడం, క్రెడిట్ కార్డులను వాడటం మంచిది కాదు. రుణం ఇస్తామంటూ వచ్చే ఫోన్లకూ సమాధానం ఇవ్వకుండా ఉండండి. రుణాలను తీసుకునేటప్పుడు వ్యక్తిగత రుణాలతో పాటు, బంగారం తాకట్టు రుణాల్లాంటివీ ఉండేలా చూసుకోండి.
రుణం సెటిల్‌మెంట్:
అనుకోని పరిస్థితుల్లో వాయిదాలు చెల్లించడం మీకు వీలు కాకపోతే.. బ్యాంకులు సెటిల్‌మెంట్ చేసుకోవాలని సూచిస్తాయి. సాధ్యమైనంత వరకూ ఇది చివరి అవకాశంగానే చూడాలి. బ్యాంకు అడగగానే దీనికి అంగీకరించకూడదు. సెటిల్‌మెంట్ చేసుకునే వారికి కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఏమాత్రం ఇష్టపడవు.
క్రెడిట్ రిపోర్ట్‌లో లోపాలు:
కొన్నిసార్లు మనం పొరపాటేమీ చేయకున్నా మన సిబిల్ స్కోరు తగ్గుతూ వస్తుంది. ఇలాంటప్పుడు మీ క్రెడిట్ నివేదికను ఒకసారి నిశితంగా పరిశీలించండి. మీకు సంబంధం లేని రుణాలేమైనా ఉన్నాయా చూసుకోండి. అలాంటివి గమనిస్తే వెంటనే బ్యాంకు, క్రెడిట్ బ్యూరోలకు ఫిర్యాదు చేయండి.