దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ 15 నుంచి బేస్ రేటును 7.45%గా నిర్ణయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలాగే, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ను కూడా తగ్గిస్తూ 12.20%గా నిర్ణయించింది.
ఎస్‌బీఐ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రుణగ్రహీతలు ప్రతి నెల చెల్లించే ఈఎమ్ఐ తగ్గుతుంది. ఇతర బ్యాంకులకు రుణాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిర్దేశించిన వడ్డీ రేటును బేస్ రేటు అంటారు.(చదవండి: పెట్రోల్, డీజిల్ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొని వస్తారా?)
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఇండియా నిర్దేశించిన బేస్ రేటు అనేది 7.30-8.80%గా ఉంది. ఈ రేటుకు తక్కువగా బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఇవ్వకూడదు. అన్ని బ్యాంకులకు ఈ రేటు వర్తిస్తుంది. అయితే, ఎస్‌బీఐ నిధుల ఆధారిత రుణ రేటు లేదా ఎంసీఎల్ఆర్ రేటు విషయంలో ఎటువంటి మార్పు చేయలేదు. ఎంసీఎల్ఆర్ అనేది ఒక బ్యాంకు రుణాలు ఇవ్వడానికి అనుమతించబడని కనీస రుణ రేటు.
ఇంతకు ముందు మేలో ఎస్‌బీఐ తన గృహ రుణ వడ్డీ రేట్లను 6.7%కు తగ్గించింది. “₹30 లక్షల వరకు గల గృహ రుణలపై వడ్డీ రేటు 6.7%గాను, ₹30 లక్షల – ₹75 లక్షలు గల రుణాలపై వడ్డీ రేటు 6.95%గాను, ₹75 లక్షలకు పైగా గృహ రుణాలపై 7.05% వడ్డీ రేటు విధిస్తున్నట్లు” రుణదాత పేర్కొంది. మహిళా రుణగ్రహీతలకు ప్రత్యేక 5 బిపిఎస్(బేసిస్ పాయింట్లు) రాయితీ ప్రకటించింది.