తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్త చేపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన మేరకు త్వరలో రూ.1,00,000 లోపు రుణాలను కూడా మాఫీ చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రూ.50 వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలను వడ్డీతో సహా రైతుల ఖాతాల్లోకి జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తికావొస్తుందని వివరించారు.
లక్ష లోపు రుణమాఫీ కోసం వచ్చే ఏడాది మార్చి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేసేలా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని కిషన్‌నగర్ వద్ద డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అలాగే సొంత నివేశనా స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందని, ఇందుకు సంబంధించి రూ.10వేల కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.