Indiramma Indlu Scheme Eligibility Details in Telugu: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేయగా.. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేయాలని యోచిస్తుంది.
ఇందులో భాగంగా.. పేదలు తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చి 11 భద్రాచలంలో నిర్వహించిన సభలో ప్రారంభించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందనుంది.
దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని పేద ప్రజలందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్వంత స్థలం ఉన్న వారికి.. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందజేయనున్నారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది.
(ఇది కూడా చదవండి: PM Surya Ghar Yojana: పీఎం సూర్య ఘర్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?)
ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. ప్రతి కొత్త ఇంటిలో కచ్చితంగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా నమూనాలను తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ప్రతీ నియోజక వర్గానికి 3500 మందికి కొత్త ఇల్లు కేటాయించనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ళు పథకం కోసం కావాల్సిన అర్హతలు:
- లబ్ధిదారుడు కచ్చితంగా దారిద్య్రరేఖ(BPL)కు దిగువన ఉండాలి.
- రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక చేస్తారు.
- లబ్ధిదారుడికి సొంతగా ఖాళీ స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి.
- గుడిసె, గడ్డితో పైకప్పు గల ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా వారు కూడా ఈ పథకానికి అర్హులే.
- అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారులు కూడా అర్హులే.
- వివాహమైనా.. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తారు.
- సింగిల్ ఉమెన్, వితంతు మహిళలూ కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- లబ్ధిదారుడు ఆ గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధి వారై ఉండాలి.
ఇందిరమ్మ ఇళ్ళు లబ్దిదారుల ఎంపిక విధానం..!
- ఇందిరమ్మ ఇంటిని పేద మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తారు.
- గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
- లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి ఆ తర్వాత అర్హులను గుర్తిస్తారు.
- జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఆ ఇంటిని మంజూరు చేస్తారు.
- జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్‌లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు.. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి.
- కిచెన్, బాత్రూం కచ్చితంగా ఉండాలి. RCC రూఫ్‌తో ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది.
- లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితాను గ్రామ, వార్డుసభలో ప్రదర్శిస్తారు.
డబ్బులు ఎలా మంజూరు చేస్తారు
- మెుదటగా బేస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష మంజూరు చేస్తారు.
- ఇంటి పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో రూ.లక్ష ఇస్తారు.
- ఇంటి పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.2 లక్షలు మంజూరు చేస్తారు.
- ఇంటి మొత్తం నిర్మాణం పూర్తయ్యాక చివరి దశలో మరో రూ.లక్ష వారి ఖాతాలో చేస్తారు.
- ఇలా రూ.5 లక్షల అర్హత గల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
(ఇది కూడా చదవండి: PM Surya Ghar Yojana: పీఎం సూర్య ఘర్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?)