Date of Birth Update in Aadhaar: మనం నిత్యం ఎక్కువగా వినియోగించే పత్రాలలో ఆధార్ కార్డ్(Aadhaar Card) ఒకటి. ఏదైనా బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, రుణం తీసుకోవాలన్న ఆధార్ తప్పనిసరి. ముఖ్యంగా అధికారిక గుర్తింపు కార్డుగా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఎక్కువగా వినియోగించే ఆధార్ కార్డ్‌లో ఏవైనా తప్పులుంటే భవిష్యత్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
అలాగే ఈ కార్డులో ఏదైనా తప్పులుంటే ప్రభుత్వ పథకాలు కోల్పోయే అవకాశమూ ఉంది. అందుకే దీనిలో వివరాలు తప్పుల్లేకుండా చూసుకోవడం మనకు చాలా ముఖ్యం. ఆధార్ కార్డ్‌లో పేరు, చిరునామా, ఫొటోతో పాటు పుట్టిన తేదీని మార్చుకోవడానికీ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) అవకాశం కల్పించింది. వీటిలో పుట్టిన తేదీని మార్చుకోవడానికి మాత్రం ఒక అవకాశం మాత్రమే ఉంది. పాన్‌కార్డ్, జనన ధ్రువపత్రం, పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్ లేదా మార్క్‌షీట్ వీటిలో ఏదైనా పత్రాన్ని సమర్పించి ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎలా మార్చుకోవాలి..?
- ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకోవడానికి మీ సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ అప్‌డేట్/కరెక్షన్ ఫారమ్‌లో వివరాలు సమర్పించాలి.
- అందులో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న పుట్టిన తేదీ వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలి.
- బయోమెట్రిక్ వివరాలు అందించి, పుట్టిన తేదీని మార్చడానికి రూ.50 రుసుము చెల్లించాలి.
- మీ డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత కొన్ని రోజుల్లో మీ పుట్టిన తేదీ అప్‌డేట్ అవుతుంది.
- ఆధార్ కార్డ్‌లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆధార్ కేంద్రం వాళ్లు ఒక స్లిప్ ఇస్తారు. దాని సాయంతో మీ ఆధార్ అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.
- కార్డు అప్‌డేట్ అయిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ నుంచి మీరే స్వయంగా ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఇంకా ఆధార్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి UIDAI హెల్ప్‌లైన్ నంబర్ 1947ను సంప్రదించొచ్చు. లేదా help@uidai.gov.in ఈ ఐడీకి ఈమెయిల్ చేయొచ్చు.