SBI MLCR Rates Hiked
SBI MLCR Rates Hiked
  • ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెంచిన ఎస్‌బీఐ
  • జులై 15 నుంచి అమలులోకి రానున్న కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు

SBI MCLR Rates Hiked: దేశంలోని అతి పెద్ద రుణ దాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు చెదువార్త చెప్పింది. రుణ రేట్లు లేదా వడ్డీ రేట్లను పెంచు తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీంతో ఎస్‌బీఐలో గృహ, వాహన, వ్యక్తి గత రుణాలు తీసుకున్న వారిపై, తీసుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. రుణ రేట్లు పెరగడం వల్ల ఈఎంఐ భారం కూడా పెరగనుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు(MCLR)ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

జులై 15 నుంచి అమలులోకి రానున్న కొత్త వడ్డీ రేట్లు

జూలై 15 నుంచి పెంచిన కొత్త రుణ రేట్లు అమలులోకి వస్తాయి. అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానం అయిన లెండింగ్ రేట్లను బ్యాంక్ మార్చలేదు. స్థిరంగానే ఉంచింది. అంటే ఇప్పుడు ఎంసీఎల్ఆర్(MCLR) రేటు ప్రాతిపదికన లోన్ తీసుకున్న వారిపై ప్రభావం పడుతుందని మనం చెప్పుకోవచ్చు.

Source: SBI

ఎస్‌బీఐ తాజా రుణ రేట్ల పెంపు తర్వాత చూస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతానికి చేరింది. పెంచకముందు ప్రస్తుతం ఈ రేటు 7.4 శాతంగా ఉంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్, నెల రోజుల ఎంసీఎల్ఆర్, మూడు నెలల ఎంసీఎల్ఆర్ అనేవి 7.05 శాతం నుంచి 7.15 శాతానికి పెరిగాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్(MCLR) అయితే 7.35 శాతం నుంచి 7.45 శాతానికి ఎగసింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రూ. 7.7 శాతానికి చేరింది. ఇక మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 7.8 శాతానికి ఎగసింది.

ఎస్‌బీఐ క్రమంగా ఎంసీఎల్ఆర్(MCLR) రేటును పెంచుకుంటూ వస్తోంది. 2022 ఏప్రిల్ నుంచి ఈ పెంపు ప్రారంభం అయ్యింది. అంటే ఆర్‌బీఐ రెపో రేటు పెంపు స్టార్ట్ అయిన దగ్గరి నుంచి ఎస్‌బీఐ కూడా రుణ రేట్లు పెంచుకుంటూ వస్తోంది. ఇదివరకు ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్(MCLR) రేటును 0.20 శాతం మేర పెంచింది. జూన్ 15న ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఇప్పుడు ఎంసీఎల్ఆర్(MCLR) రేటు పెరిగింది.

అలాగే, ఎస్‌బీఐ చివరిసారి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటును జూన్ 15నే పెంచింది. ప్రస్తుతం బ్యాంక్ ఈబీఎల్ఆర్ 7.55 ప్లస్ సీఆర్‌పీగా, ఆర్ఎల్ఎల్ఆర్ 7.15 ప్లస్ సీఆర్‌పీగా ఉంది. అయితే రుణ రేట్లు అనేవి క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన మారతాయి. 800కు పైన సిబిల్ స్కోర్ ఉంటే రుణ గ్రహీతలు తక్కువ వడ్డీకే లోన్ పొందే అవకాశం ఉంటుంది.

(ఇది కూడా చదవండి: నెలకు వెయ్యి రూపాయల పెట్టుబడితో.. రూ.26.32 లక్షలు సంపాదించండి)