కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దేశీయ టెలికామ్ రంగ సంస్థలకు 5జీ ట్రయిల్స్ కోసం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర అనుమతి ఇవ్వడంతో దేశంలోని ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌టెల్ ట్రయిల్స్ చేయడం ప్రారంభించింది. తాజాగా గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో మిడిల్ బ్యాండ్ 3500 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రంలో 5జీ నెట్‌వర్క్‌ను ఎయిర్‌టెల్ పరీక్షించింది. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఎయిర్‌టెల్ ఈ ట్రయల్స్ నిర్వహించింది.
ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీతో సహా మరో ఇతర నాలుగు భారతీయ టెలికం సర్కిల్‌లలో ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రంను డీఓటి కేటాయించింది. దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా మిడ్-స్పెక్ట్రంను పరీక్షించే అవకాశం ఉంది. ఎకనామిక్ టైమ్స్ టెలికాం నివేదిక ప్రకారం.. ఈ ట్రయిల్స్ లో ఇంటర్నెట్ వేగం 1 జీబీపీఎస్ వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. దీంతో దేశంలో మొదటి సారిగా 5జీ ట్రయిల్స్ నిర్వహించిన సంస్థగా టెలికాం కంపెనీగా ఎయిర్‌టెల్ నిలిచింది. ఎయిర్‌టెల్‌కు 5జీ ట్రయల్ కోసం 3500 మెగాహెర్ట్జ్, 28 గిగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం కేటాయించినట్లు నివేదికలో పేర్కొంది.
అలాగే, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా(వి)లకు కూడా 700 మెగాహెర్ట్జ్, 3.5 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌లను కేటాయించారు. 5జీ ట్రయిల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న టీఎస్‌పీలలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎమ్‌టిఎన్‌ఎల్ ఉన్నాయి. ఎయిర్‌టెల్ 5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్ 5జీ నెట్‌వర్క్ గేర్‌తో కలిసి పనిచేస్తోంది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్ టెక్నాలజీ ప్రొవైడర్లతో ఇప్పటికే టీఎస్‌పీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా, రిలయన్స్ జియో తన సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించనుంది. ఈ ట్రయిల్స్ కేవలం 6 నెలల కాలంలో దేశంలోని పల్లె, పట్టణ ప్రాంతాలలో నిర్వహించాల్సి ఉంటుంది.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.