Income Tax Saving Tips in Telugu: ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేస్తుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో ఆందోళన చెందకుండా ఉండటానికి, సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరం. ఆదాయపు పన్ను ఆదా చేసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏడాదికి ఎంత మదుపు చేయాలి?
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ భవిష్య నిధి, పిల్లల ట్యూషన్ ఫీజులు, గృహరుణం అసలు, జీవిత బీమా పాలసీల్లాంటి వాటిని మీరు దీనిలో చూపించుకోవచ్చు. ఇవే గాక ఇంకా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా చూసుకోవాలి.
(ఇది కూడా చదవండి: CIBIL Score: క్రెడిట్ స్కోరు అంటే ఏమిటి? ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలి?)
ఆ తర్వాతే మిగతా పెట్టుబడి పథకాల గురించి ఆలోచించాలి. అవసరం లేకున్న ఇతర పన్ను ఆదా పథకాల్లో డబ్బులు మదుపు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి, ఇప్పటికే ఉన్న పెట్టుబడులను ఒకసారి మీరు సమీక్షించుకోండి. అప్పుడు మీకు ఒక స్పష్టత వస్తుంది.
ఎలాంటి ఆదాయపు పన్ను ఆదా పథకాలను ఎంచుకోవాలి?
పన్ను ఆదా పథకాలను ఎంచుకునేటప్పుడు తొందర పడకూడదు. దీనివల్ల భవిష్యత్‌లో మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టే ముందు కొద్దిగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. ఈ పన్న ఆదా పథకాల వల్ల రానున్న ఏళ్లలో ఆదాయం ఎలా ఉంటుంది? కొత్త పన్ను విధానంలోకి మారే అవకాశాలున్నాయా? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఈ తరహా పథకాలలో పెట్టుబడి పెట్టాలి.
సురక్షిత పథకాల్లో పెట్టుబడి..
సెక్షన్ 80సీ పరిమితిని పూర్తిగా వినియోగించుకునేందుకు సురక్షితంగా ఉంటూ, రాబడికి హామీ ఉన్న పథకాలనూ మొదట పరిశీలించాలి. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలాంటివి ఉంటాయి. వీటిద్వారా పన్ను ఆదా చేసుకోవడంతోపాటు, కచ్చితమైన రాబడినీ ఆశించవచ్చు. ఆయా పథకాలు మీకు అనుకూలమేనా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి.
సెక్షన్ 80సీకి అదనంగా పన్ను మినహాయింపు
జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్)ను ఎంచుకోవడం ద్వారా అదనంగా పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీలో రూ.1,50,000 పరిమితి మించిన తర్వాత అదనంగా ఇందులో రూ.50వేలను మదుపు చేయొచ్చు. టైర్-1 ఖాతాలో ఎన్‌పీఎస్ ఎంచుకుంటేనే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక వ్యక్తికి 60 ఏళ్లు పూర్తయ్యాక NPS ఖాతాలోని మొత్తం నుంచి 60 శాతం డబ్బును వెనక్కి తీసుకునే వీలుంటుంది. మిగతా 40 శాతాన్ని తప్పనిసరిగా పింఛను పథకాల కొనుగోలుకు వినియోగించాలి.