EPFO Wage Ceiling
EPFO Wage Ceiling

EPFO Wage Ceiling: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త ప్రకటించే అవకాశం ఉంది. ఈ పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచునున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.15వేలుగా ఉన్న వేతన పరిమితిని రూ.21 వేలకు త్వరలోనే పెంచనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే గనుక జరిగితే ఇక నుంచి ఉద్యోగులు, యజమానులు చెల్లించే వాటా పెరగనుంది.

దీనివల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేరకు పెరుగుతుంది. ప్రస్తుత ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో పెంచారు. అప్పట్లో రూ.6,500గా ఉన్న గరిష్ఠ వేతనాన్ని రూ.15వేలకు పెంచారు. 20 మంది కంటే ఎక్కువ ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజాగా ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

(ఇది కూడా చదవండి: ఈడీఎల్ఐ స్కీమ్ కు ఎవరు అర్హులు, దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటి?)

ఇందుకోసం అధిక వేతనం నిర్ణయించేందుకు ఒక కమిటీని ప్రభుత్వం నియమించే ఆలోచనలో ఉంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఎప్పటికప్పుడు గరిష్ఠ వేతన పరిమితిని ఈ కమిటీ సమీక్షిస్తుంది సాధారణంగా ఉద్యోగి వాటాగా వచ్చే బేసిక్ వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది.

యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతాయి. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ వేతన పరిమితి ప్రకారం.. 8.33 శాతం కింద రూ.1250 ఈపీఎస్‌ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా మొత్తం ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. గరిష్ఠ వేతన పరిమితి పెరిగితే ఆ మేర ఉద్యోగి వాటా, యజమాని వాటా పెరుగుతుంది. పెన్షన్‌ ఖాతాలో ఎక్కువ మొత్తం జమ కానున్నాయి.

ఉద్యోగి వేతనంపై ఈపీఎఫ్‌ ఎలా లెక్కిస్తారు..

ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం (బేసిక్‌ + డీఏ) రూ.20 వేలు ఉందనుకుందాం. ఇందులో ఉద్యోగి వాటా రూ.2400 తన ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతాయి. యజమాని వాటా కింద రూ.2400 కూడా జమ అవుతాయి. యజమాని చెల్లించే నగదులో రూ.1600 ఈపీస్(EPS) ఖాతాలో, మిగతా రూ.800 మీ పీఎఫ్ ఖాతాలో జమ అవుతాయి.