అమెరికా, యూరప్ దేశాలు విధిస్తున్న ఆంక్షలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు పెడితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను కూల్చేస్తామని ఆ దేశాలను హెచ్చరించింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను యూరప్ దేశాలపై కూల్చేస్తే మీకు ఓకేనా అంటూ రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ రొగొజిన్ ప్రశ్నించారు. ఆంక్షలతో రష్యాను కట్టడి చేయాలని చూస్తే ఫలితం వేరేలా ఉంటుందని అమెరికా, యూరప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లోని సామాన్య ప్రజానీకంపై రష్యా సైన్యం భీకర దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ విషయంలో రష్యాకు మద్దతుగా నిలుస్తూ తమకు(నాటోకు) వ్యతిరేకంగా ఉన్న దేశాలకు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్ వల్ల భద్రతకు ప్రమాదం పొంచి ఉందంటూ రష్యా ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టిందని దుయ్యబట్టారు. అయితే బైడెన్ ఈ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే.. రష్యా బెదిరింపు ధోరణికి దిగింది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ చీఫ్ డిమిత్రి రోగోజిన్ అగ్ర దేశాన్ని బెదరించారు. మమ్మల్ని ఆంక్షలతో కంట్రోల్ చేయాలని చూస్తే స్పేస్ స్టేషన్‌ను ఎవరు కాపాడతారు? అని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్‌లు చేశారు.
“మీరు మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే అమెరికా, ఐరోపా దేశాల్లో స్పేస్ స్టేషన్ పడకుండా ఎవరు కాపాడతారు? అంటూ రోగోజిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. యూరప్? భారత్ – చైనా దేశాల మీద 500టన్నుల స్పేస్ స్టేషన్ కూల్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రవర్తనతో వాళ్లను ప్రమాదంలో పడేయాలని అనుకుంటున్నారా?” ఐఎస్ఎస్ రష్యా మీదగా ఎగరదు, కాబట్టి ప్రమాదాలన్నీ మీకే. మీరు వాటికి సిద్ధంగా ఉన్నారా? అంటూ రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
(చదవండి: హృదయ విదారకం.. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్న వీడియో!)