ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు ఆ సంస్థ ఉద్యోగులు భారీ షాక్ ఇవ్వనున్నారు. 20 దేశాలకు చెందిన అమెజాన్ ఉద్యోగులు తమ డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ ధర్నా చేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వంటి కష్ట కాలంలో కూడా రేయింబవళ్లు సంస్థ కోసం పనిచేశామని, అందువల్లే జెఫ్‌బెజోస్ 200 బిలియన్ల డాలర్లతో ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారని గుర్తు చేశారు. తాము చేసిన పనికి తగ్గట్లు వేతనాన్ని ఆశిస్తున్నామని ఇప్పటికే స్ట్రైక్‌లో పాల్గొన్న ఉద్యోగులు తెలిపారు.
(చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!)
ఈ నెల నవంబర్ 26న అమెజాన్‌లో పనిగంటలు, కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు అకౌంటబులిటీ(జవాబు దారీతానాన్ని)తో పాటు మొత్తం 25 రకాల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బ్లాక్ ఫ్రైడే రోజు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ సమ్మెలో 20 లేదా అంతకాన్నా ఎక్కువ దేశాలకు చెందిన అమెజాన్ ఉద్యోగులు, యూనియన్ సంఘాలు, గ్రీన్‌పీస్, ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు స్ట్రైక్‌కు మద్దతు పలకనున్నారు. అమెజాన్‌లో పనిగంటలు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పని గంటలు ఎక్కువగా ఉన్న అందుకు తగ్గట్లు వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

అమెజాన్ తక్కువ జీతాల్ని చెల్లిస్తుంది అంటూ ఉద్యోగులు చేస్తున్న స్ట్రైక్ ప్రపంచానికి తెలిపేందుకు మేక్ అమెజాన్‌పే.కామ్ పేరుతో ఒక వెబ్‌సైట్ కూడా లాంఛ్ చేశారు. ఉద్యోగులు చేస్తున్న స్ట్రైక్‌కు మద్దతుగా పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెజాన్ పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటుందంటూ ‘ప్రోపబ్లికా’ నివేదిక వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం జెఫ్‌బెజోస్ 2006 నుంచి 2018 మధ్య ఎలాంటి పన్నులు చెల్లించలేదని నివేదికలో పేర్కొంది. ఈ సమ్మె వల్ల అమెజాన్ సంస్థకు భారీ నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు.