వంట నూనెల ధరల తగ్గుదల గురుంచి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరగుతున్న వంట నూనెల ధరల కట్టడి కోసం దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ఆయిల్‌పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను క్రమ క్రమంగా తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగిన సంగతి తెలిసిందే. దేశంలో వాడుతున్న వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్, అమెరికాలలో ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియా దేశాలు ఎగుమతి సుంకాలను పెంచాయి. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి నేటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితమే కేంద్రం వంట నూనెలపై విధిస్తున్న పన్నులను తగ్గించింది. అయినా కూడా ధరలు మాత్రం అదుపులోకి రాలేదు.

అందుకే దేశీయంగా ఉత్పత్తి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇండియా ఎక్కువగా పామ్‌ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. వేరు శనగ, పొద్దు తిరుగుడుతో పోలిస్తే మన దగ్గర పామ్ ఆయిల్ సాగు చాలా తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకోసమే మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది.