దేశంలో గత కొద్ది రోజుల నుంచి పెరిగిపోతున్న పెట్రో, డీజిల్ ధరలు వల్ల సామాన్యుడి నడ్డి విరిగిపోతుంది. ఇది ఇలా ఉంటే, మరోపక్క ఎల్‌పీజీ గ్యాస్, వంట నూనె వంటి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుడు బ్రతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. గత ప్రభుత్వాల కాలంలో కొద్ది పాటి ధరలు పెరిగితే రచ్చ రచ్చ చేసే ప్రతి పక్షాలు ఇప్పుడు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. ఇదిలా ఉంటే, సామాన్యులపై వచ్చే నెలలో మరింత భారం పడనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. వచ్చే నెల అక్టోబర్‌ నెలలో గ్యాస్‌ సిలిండర్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వంట గ్యాస్ ధరలు ఏకంగా 57 – 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు/విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేల గ్యాస్‌ సిలిండర్‌ ధరలు నిజంగానే పెరిగితే ఇక వాటిని కొనాలంటే సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉంది. మళ్లీ గ్రామీణ ప్రజలు కట్టాల పొయ్యి వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన డొమెస్టిక్ గ్యాస్ పాలసీ నియమాల ప్రకారం.. ప్రతి 6 నెలలకు ఒకసారి కేంద్రం నేచురల్ గ్యాస్ ధరలను సమీక్షిస్తుంది.

అయితే, ఈ సమీక్షలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో నేచురల్ గ్యాస్ ధరలను తగ్గించడం లేదా పెంచడం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం చూస్తే వచ్చే నెలలో దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు అధిక మొత్తంలో పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ ధర మీ.మీ.బీ.టీ.యుకు 1.79 డాలర్‌గా ఉంటే ఇది వచ్చే నెల 3 డాలర్ల పైకి పెరగవచ్చు అనే అంచనాలున్నాయి. విదేశీ మార్కెట్‌లో నేచురల్ గ్యాస్ ధర సెప్టెంబర్ 8న ఒక్క రోజే 8 శాతం పెరిగింది. దీంతో గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here