గత కొద్ది రోజుల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. దీంతో, బంగారం & చమరు ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మరి కారణంగా రెండేళ్లుగా మందగించిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో రష్యా మొదలుపెట్టిన యుద్ధం ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగిస్తున్న బాంబులు, రాకెట్ల ప్రభావం స్టాక్ మార్కెట్, చమురు, బంగారం ధరలపై నేరుగా కనిపిస్తుంది. క్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైందన వార్తలు రావడంతో మార్కెట్ షేక్ అయ్యింది. బంగారం ధరలు ఒక్క రోజు వ్యవధిలోనే 30 శాతం పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకి రూ. 850 పెరిగింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకి రూ.930లు పెరిగింది.

2022 ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటల సమయంలో ఆభరణాల తయారీలో ఉపయోగించే బంగారం తులం ధర రూ. 46,850 దగ్గర ట్రేడవుతుండగా స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.51,100లుగా ఉంది. ఇక గత మూడు నాలుగు రోజులుగా 97, 98 డాలర్ల దగ్గర అటు ఇటు ఊగిసలాడుతున్న క్రూడ్ ఆయిల్ ధర యుద్ధం మొదలు కాగానే 2022 ఫిబ్రవరి 24 వంద డాలర్లకు చేరుకుంది. యుద్ధ తీవ్రత మరింతగా కొనసాగి.. అటు ఆంక్షలు కూడా పెరిగితే ముడి చమురు ధరలకు కళ్లెం వేయడం అసాధ్యమయ్యే పరిస్థితి ఎదురు కానుంది.
(చదవండి: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్ డబ్బులు!)