దేశంలో కొద్ది నెలలుగా మండుతున్న ముడిచమురు ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. చమురు ధరల తగ్గింపు కోసం అత్యవసర వినియోగానికి పక్కనపెట్టిన చమురు నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా అమెరికా, చైనా, జపాన్ బాటలో నడవనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో ఏర్పాటు చేసిన భూగర్భ బిలాలలో కేంద్ర ప్రభుత్వం 3.8 కోట్ల బ్యారళ్ల(5.33 మిలియన్ టన్నులు) ముడిచమురును నిల్వ చేసింది.
(చదవండి: అసైన్డ్ ఇంటి యజమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!)
వీటి నుంచి తాజాగా 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 1.33 మిలియన్ టన్నులు, కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నులు, పాడూర్‌లో 2.5 మిలియన్ టన్నులు చొప్పున చమురు స్టోరేజీలున్నాయి. ఇలా చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు????.
ప్రపంచ ఇంధన ధరలు తగ్గేందుకు వీలుగా నిల్వల నుంచి చమురును వెలికి తీయాల్సిందిగా గత వారం అమెరికా ప్రభుత్వం ఇతర దేశాలను అభ్యర్థించింది. ఇందుకు ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు చైనా, ఇండియా, జపాన్ వంటి దేశాలనుద్ధేశించి కలసికట్టుగా వ్యవహరించాలంటూ సూచించింది. చమురు ఉత్పత్తిని పెంచమంటూ పలుమార్లు చేసిన అభ్యర్థనలను పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్), తదితర దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో యూఎస్ వినియోగ దేశాలకు చమురు విడుదలకు సూచించింది.