ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్ మస్క్, వ్యాపారంతో పాటు తన చిలిపి పనులతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. టెస్లా సీఈఓగా, స్పేస్‌ఎక్స్ అధినేతగా.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తాడు. తాజాగా ఎలన్ మస్క్ చేసిన ఒక ట్వీట్ అభిమానులను ఓవైపు సరదాగా, మరోవైపు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాను చేస్తున్న పనులన్నింటిని వదిలేసి.. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోవాలనుకుంటున్నట్లు ట్వీటేశాడు. అంతేకాదు దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగాడు కూడా. దీంతో కార్పొరేట్ రంగంలో కలకలం రేగింది.
సంచలనాత్మక నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ఎలన్ మస్క్!
ఎలన్ మస్క్ కు ఇలాంటి ట్వీట్ చేయడం కొత్త ఏమి కాదు, గతంలో కూడా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. నిజంగానే తాను నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? అలాగని జోక్ చేశాడని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మస్క్ చెప్పిందే చెప్పినట్లు చేసిన దాఖలాలు కూడా ఎక్కువ కాబట్టి. ట్విటర్ వేదికగా గతంలో ఆయన చెప్పినవెన్నో చేశాడు కూడా. అంతెందుకు ఈమధ్యే టెస్లాలోని తన 10 శాతం వాటాను సైతం అమ్మేద్దామనుకుంటున్నానని ఫాలోవర్స్ అభిప్రాయం కోరినప్పుడు.. అంతా నవ్వుకున్నారు.
కానీ, టెస్లా బోర్డు సభ్యులతో సహా అందరికీ షాకిస్తూ.. వాటాను అమ్మేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే 12 బిలియన్ డాలర్ల షేర్లను అమ్మేశాడు కూడా. ఈ తరుణంలో మస్క్ తాజా ట్వీట్ కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. మస్క్ నిర్ణయం ఎలాంటిదైనా.. ఈ ట్వీట్ ప్రభావం స్టాక్ మార్కెట్‌పైనా పడే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.