Indane Tatkal Seva

Indane Tatkal Seva: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త అందించింది. ఇక స్వీగ్గీ, జోమటో డెలివరీ యాప్స్ తరహాలో వేగంగా గ్యాస్ సీలిండర్లను డోర్ డెలివరీ చేసేందుకు తత్కాల్‌ పథకం కింద ఐఓసీఏల్ పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. దేశం మొత్తం మీద 28 కోట్ల డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఉంటే అందులో 14 కోట్ల కనెక్షన్లు ఇండియన్‌ ఆయిల్‌ గ్యాస్ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ తత్కాల్‌ స్కీమ్‌ను ముందుగా ఇండియన్‌ ఆయిల్‌ పరిధిలో ఉన్న వినియోగదారులకు ఈ సేవలు అందించనున్నారు.

ఈ పైలట్‌ ప్రాజెక్టు కోసం మొదటగా హైదరాబాద్‌ నగరాన్ని ఎంపిక చేయడం విశేషం. ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్‌ డివిజన్‌లో ఈ పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. రెగ్యులర్‌గా ఎల్‌పీజీ గ్యాస్ బుక్‌ చేసే ఐవీఆర్‌ఎస్‌, ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌, ఇండియన్‌ ఆయిల్‌ వన్‌ యాప్‌లలో ఈ తత్కాల్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి తత్కాల్‌ పద్దతిలో సిలిండర్‌ బుక్‌ చేయగానే.. సదరు ఏజెన్సీకి వెంటనే పుష్‌ మెసేజ్‌ వెళ్లిపోతుంది. వారు అక్కడి నుంచి డెలివరీ బాయ్‌కి ఆ మెసేజ్‌ని చేరవేస్తారు. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్‌ బుక్‌ అవుతుంది.

2 గంటల్లో డోర్ డెలివరీ

సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గరిష్టంగా 2 గంటలలోపు వినియోగదారులకు ఫుల్‌ సిలిండర్‌ను అందిస్తారు. అందుకు గాను గ్యాస్‌ సిలిండర్‌ ధరపై అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సర్వీసులను ప్రస్తుతం సింగిల్‌ సిలిండర్‌ ఉన్న ఇళ్లకే అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఈ తత్కాల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా దేశమంతటా, అందరు వినియోగదారులకు తత్కాల్‌ సేవలు అందివ్వనున్నారు.

(చదవండి: వినియోగదారులకు బంపరాఫర్‌..! ఉచితంగా యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌!)