మీరు కలల గృహం కోసం రుణం తీసుకోవాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. చాలా తక్కువ ధరకే రూ. 2 కోట్ల వరకు గృహ రుణాలను అందించనున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్) పేర్కొంది. రూ.2 కోట్ల వరకూ గృహ రుణంపై కూడా అతి తక్కువ వడ్డీరేటు 6.66 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. పండుగ ఆఫర్ల కింద రూ.50 లక్షల రుణం వరకూ ఉన్న ఈ అతితక్కువ వడ్డీరేటు ఆఫర్‌ను రూ.2 కోట్ల వరకూ పెంచుతున్నట్లు తెలిపింది. కొత్త రుణ గ్రహీతలకు రూ.50 లక్షల వరకూ 6.66 శాతం వద్ద అతితక్కువ రుణ రేటు నిర్ణయాన్ని ఈ ఏడాది జూలైలో సంస్థ ప్రకటించింది.
అయితే, 6.66 శాతం వడ్డీరేటు గృహం రుణం కోరుకునే వారికి సిబిల్ స్కోర్ 700 ఆపైన ఉండాలి. 2021 సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 30 మధ్య రుణ మంజూరు చేసి ఉండాలి, అలాగే మొదటి దఫా రుణ పంపిణీ 2021 డిసెంబర్‌లోపు జరిగి ఉండాలి. వేతనం పొందుతున్న వారితో పాటు స్వయం సంపాదన పరులకూ కూడా ఈ తక్కువ వడ్డీ వర్తిస్తుందని సంస్థ ఎండీ, సీఈఓ వై విశ్వనాథ్ గౌడ్ తెలిపారు.
రూ.2 కోట్ల వరకూ రుణం తీసుకున్న సందర్భంలో రుణ మొత్తంపై 0.25% లేదా గరిష్టంగా రూ.10,000కానీ ఏది తక్కువైతే అంత మొత్తం ప్రాసెసింగ్ ఫీజు రాయితీ లభిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. గృహ రుణానికి ఆన్‌లైన్ దరఖాస్తు, ఆమోదానికి ఉద్దేశించి ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ ఇటీవలే ‘హోమై యాప్’ను ఆవిష్కరించింది.(చదవండి: ఇల్లు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(EC), ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(OC) ఎందుకు ముఖ్యం?)