ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం-కిసాన్ పథకం కింద విడుదల చేసే 10వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ 2022 జనవరి 1న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేస్తారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) బుధవారం తెలిపింది. అలాగే, అదే రోజున కొంత మంది రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నట్లు పీఎంఓ తెలిపింది.
(పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. డిసెంబర్ 31 లోపు ఈ-కేవైసి చేయకపోతే రూ.2 వేలు రానట్లే..!)
పీఎంఓ తెలిపిన వివరాల ప్రకారం.. 10 కోట్లకు పైగా లబ్ధిదారు రైతు కుటుంబాలకు ₹20 వేల కోట్లకు పైగా నగదును దశల వారీగా జమ చేయనున్నట్లు పేర్కొంది. పీఎం-కిసాన్ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది ₹6000లను ఖాతాలో జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా ₹2000 చొప్పున జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఈ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు ₹1.6 లక్షల కోట్లకు పైగా నగదును రైతు కుటుంబాలకు బదిలీ చేసినట్లు పత్రికలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.