Pradhan Mantri Awas Yojana (Urban) 2024: వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. దేశంలో సుమారు కోటి ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో బడ్జెట్ ప్రణాళికను సిద్దం చేసింది. ఇందులో భాగంగా కోటి ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్(పీఎంఏవై-యూ) 2.0కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-యూ) 2.0 అంటే?
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) 2.0 పట్టణాల్లో నివసించే అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకునేందుకు, లేదంటే ఇల్లు కొనుగోలు చేసేందుకు, సౌకర్యంగా ఉండే అద్దె ఇంటిలో ఉండేలా ప్రతి ఒక్కరికి ఆర్ధిక సహాయం చేయడమే పీఎంఏవై-యూ(PMAY-U) 2.0 ముఖ్య ఉద్దేశ్యం. ఇందుకోసం సబ్సిడీపై గృహ రుణాన్ని అందిస్తుంది కేంద్రం.
పీఎంఏవై-యూ(PMAY-U) 2.0 వల్ల ఎవరికి ప్రయోజనం?
పీఎంఏవై-యూ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. మురికివాడల్లో నివసించేవారు. ఎస్సీ,ఎస్టీ లు, మైనారిటీలు, వితంతువులు, వికలాంగులు, సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలతో సహా అట్టడుగు వర్గాలకు ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది కేంద్రం. అదనంగా, సఫాయి కార్మికులు, వీధి వ్యాపారులు, చేతివృత్తులవారు, అంగన్‌వాడీ కార్మికులకు ఈ పథకం కింద కేంద్రం ప్రయోజనాల్ని కల్పిస్తుంది.
పీఎంఏవై-యూ (PMAY-U) 2.0 అర్హతలు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ PMAY-U 2.0 పథకం దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు లేని ఆర్థిక బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్యస్థాయి ఆదాయ వర్గం(ఎంఐజీ) వారు ఈ పథకానికి అర్హులు.
పీఎంఏవై-యూ పథకం దరఖాస్తుకు ఆదాయ ప్రమాణాలు:
ఈడబ్ల్యూఎస్: రూ. 3 లక్షల వరకు వార్షిక ఆదాయం.
ఎల్ఐజీ వర్గం: వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు.
ఎంఐజీ వర్గం: వార్షిక ఆదాయం రూ. 6 లక్షల నుండి రూ. 9 లక్షల వరకు.
ఈ పథకం కింద రాయితీ ఎంత పొందవచ్చు?
గరిష్టంగా 12 సంవత్సరాల కాలవ్యవధికి మొదటి రూ.8 లక్షల లోన్‌పై 4శాతం వరకు వడ్డీ రాయితీ, రూ. 35 లక్షల వరకు విలువైన ఆస్తితో రూ. 25 లక్షల వరకు బ్యాంకులో రుణం తీసుకునేందుకు సదుపాయం. అర్హతగల లబ్ధిదారులు ఐదు సంవత్సరాల గరిష్టంగా రూ. 1.80 లక్షల సబ్సిడీని పొందవచ్చు.