కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు(జూన్ 9 వరకు) కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో లాక్‌డౌన్ మినహాయింపు సమయాన్ని పెంచింది. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చింది. సడలింపు సమయంలో బయటకు వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికి చేరడానికి మరో గంట పాటు, (సడలింపు సమయానికి అధనంగా) అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులు బాటు కల్పించింది.(ఇది కూడా చదవండి: తెలంగాణ రైతున్నలకు శుభవార్త!)
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు అనుమతి
ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లారి ఉదయం 6 గంటల దాకా లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో కొవిడ్, లాక్‌డౌన్ సడలింపు నిబంధనలను అనుసరించి, ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై మంత్రివర్గం చర్చించింది. కరోనా వ్యాప్తి తీరు, బాధితులకు అందుతున్నవైద్యం, నియంత్రణ కోసం వైద్యశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది. కాగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నదని వైద్యశాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.
మరో 7 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు
రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెంలలో 7 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికే మంజూరయి వున్న వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా కేబినెట్ మంజూరు చేసింది. వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని, ప్రస్తుతం జైలు వున్న ప్రాంగణంలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
జైలులో ప్రస్తుతం వున్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలని, జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని, హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తర్వాతి కేబినెట్ కు తీసుకురావాలని హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.