తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ఏడాది ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. తెలంగాణలో భూముల వివాదాలే అసలే ఉండకూడదని.. అన్ని లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ధరణిని రూపొందించారు. అన్ని భూ సమస్యలకు ధరణియే పరిష్కారం అని ప్రభుత్వం చెబుతోంది. కానీ, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఉడినట్లుంది ప్రస్తుత పరిస్థితి. ధరణి వల్ల కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. పాస్‌బుక్‌లు అందక.. వచ్చినా అందులో సరైన వివరాలు లేక.. రైతులు చాలా గోస పడుతున్నారు. ఎంతో మంది ప్రభుత్వం అందించే రైతు బంధుకు కూడా దూరమవుతున్నారు.

ఈ నేపథ్యంలో రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ధరణి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేస్తోంది. తాజాగా మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చి.. రైతులకు శుభవార్త చెప్పింది. ధరణి రికార్డుల్లో యజమాని పేరుకు బదులు ‘ఇల్లు/ ఇంటి స్థలం’ అని నమోదైన భూముల‌పై వినతులకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజమానులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూపెట్టకపోవడం లేదా అధికారుల తప్పిదం వల్ల కొన్ని సర్వే నంబర్లలోని భూములకు రైతు పేరుకు బదులుగా ‘ఇల్లు’ లేదా ‘ఇంటి స్థలం’ అని నమోదైంది.

అంతేకాదు ఏదైనా సర్వే నెంబరులో కొత్త భాగం ఇళ్ల స్థలాలుగా మారినా.. వ్యవసాయేతర భూమిగా వర్గీకరించిన.. ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని ధరణి పోర్టల్‌లో ఇంటి స్థలంగానో.. వ్యవసాయేతర భూమిగానో చూపిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఊరట కల్పిస్తూ.. కొత్త సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. వీటిని సవరించుకునేందుకు ధరణిలో ‘ఇష్యూ ఆఫ్‌ పీపీబీ ఆర్‌ నాలా కన్వర్షన్‌ వేర్‌ పట్టాదార్‌ నేమ్‌ ఈజ్‌ షోన్‌ యాజ్‌ హౌజ్‌/హౌజ్‌ సైట్‌’ అనే పేరుతో ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • పలానా సర్వే నెంబర్‌లోని భూమి నాలా, ఇళ్లు, ఇళ్ల స్థలాల పరిధిలోకి రాదంటూ.. వాటికి సరైన ఆధారాలతో ధరణి పోర్టల్‌లో లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
  • పట్టాదారు వివరాలు, భూమి వివరాలు, పాత పాస్‌బుక్‌, రిజిస్ట్రేషన్‌ పత్రాలు వంటి యాజమాన్యాన్ని నిర్ధారించే పత్రాలు, ఆ భూమి ఫొటో లేదా వీడియోను జత చేయాల్సి ఉంటుంది.
  • రైతులతోపాటు సంస్థలకు కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. అప్లికేషన్‌ పూర్తి కాగానే రిజిస్టర్డ్‍ మొబైల్‌ నంబర్‌కు ఒక SMS వస్తుంది. ఆ తర్వాత బయోమెట్రిక్‌ అథెంటిఫికేషన్‌ చేయాలి.
  • సొంతంగా ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునేవారు సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌ పూర్తయ్యాక దరఖాస్తు నేరుగా జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్తుంది.

కలెక్టర్‌ దానిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించడం లేదా తిరస్కరించడం చేస్తారు. ఒకవేళ అనుమతి వస్తే వెంటనే ఈ-పట్టాదార్ పాస్‌బుక్‌ మంజూరవుతుంది. గ్రీన్‌ కలర్ పాస్‌బుక్‌ను పోస్టు ద్వారా నేరుగా రైతు ఇంటికే పంపిస్తారు.