Telangana Crop Loan Waiver Guidelines Telugu: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. అందుకు కొన్ని మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుండి పొందిన స్వల్పకాలిక రుణాలకు రూ. 2 లక్షల వరకు హామీ ఇచ్చిన విధంగా పంట రుణమాఫీ వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ రుణ మాఫి డిసెంబర్ 12,2018 నుంచి 2023 సంవత్సరం డిసెంబర్ 12 మధ్య తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. ప్రతి రైతు కుటుంబం రూ.2 లక్షల వరకు మాఫీకి అర్హులు. ఇందులో గత సంవత్సరం డిసెంబర్ 12 నాటికి చెల్లించాల్సిన అసలు వడ్డీ కూడా ఉంటుందని వెల్లడించింది.
రూ.2 లక్షల పంట రుణమాఫీ మార్గదర్శకాలు:
పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి వ్యవసాయ శాఖ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్ పోర్టల్’ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. పోర్టల్‌లో అర్హులైన రైతుల రుణ ఖాతా డేటా వివరాలు ఉంటాయి. సంబంధిత శాఖల డేటా ధ్రువీకరణ తర్వాత రైతుల అర్హతను నిర్ణయిస్తారు.
బిల్లుల సమర్పణ కోసం ఆర్థిక శాఖ నిర్వహించే Integrated Financial Management and Information (ఐఎఫ్ఎంఐ) వెబ్ పోర్టల్ లో సంబంధిత శాఖ సబ్మిట్ చేస్తుంది. రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇందులో కొన్ని ప్రత్యేక మాడ్యుల్స్ ఉండనున్నాయి.
అర్హులైన రైతుల కుటుంబాలను గుర్తించేందుకు పట్టాదార్ పాస్ పుస్తకాల ఆధార్ డేటాను పీడీఎస్ డేటాబేస్ తో సరిపోల్చి చూస్తారు. అందులో నిర్దారించిన తర్వాత అర్హులైన రైతుల సబంధిత అకౌంట్లలో రూ. 2 లక్షలు జమ అవుతాయి.
రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాల ఉంటే
రైతులు రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్నట్లయితే, కుటుంబంలోని మహిళ పొందిన రుణాలు ముందుగా మాఫీ చేయబడతాయి. పురుష సభ్యుల పేరుతో తీసుకున్న మిగిలిన రుణాలు దామాషా ప్రకారం మాఫీ అవుతాయి.
వీళ్లకు పంట రుణమాఫీ వర్తించదు
స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ), జాయింట్ లయబిలిటీ గ్రూప్ (జేఎల్‌జీ), రైతు మిత్ర గ్రూపులు (ఆర్ఎంజీ) ఎల్‌ఐసీఎస్ తీసుకున్న రుణాలకు పంట రుణాల మాఫీ వర్తించదు. పీఏసీఎస్ నుండి పొందిన రుణాలకు మినహా కంపెనీలు, సంస్థలు పొందిన రుణాలకు అలాగే రీషెడ్యూల్డ్, రీ-స్ట్రక్చర్ చేసిన రుణాలకు కూడా రుణ మాఫీ వర్తించదు.
పీఎం కిసాన్ కింద
ఆసక్తికరమైన విషయమేమిటంటే పీఎం కిసాన్ కింద మినహాయింపు పొందినట్లైతే ఆ మొత్తాన్ని తీసేసి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని ఇస్తుంది. ఇందుకోసం పీఎం కిసాన్ డేటాను వినియోగించుకోనుందని తెలుస్తోంది. ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంటుంది. గమనించగలరు.
బ్యాంకులు చేయాల్సిన పని
బ్యాంకులు విధిగా డేటాను (ప్రొఫార్మా-I , II) ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల అర్హతలు, వారు పొందిన రుణాల వాస్తవ వివరాలను సమగ్రంగా అందజేసేలా చర్యలు తీసుకోవాలి. రుణమాఫీకి సంబంధించిన అన్ని పత్రాలపై అలాగే పథకం కోసం బ్యాంకులు తయారుచేసిన జాబితాలపై బ్యాంకులకు సంబంధించిన నోడల్ అధికారి డిజిటల్ సంతకం తప్పనిసరిగా ఉండాలి.
రైతులు చేయాల్సింది ఇదే
రైతులు, తమ వంతుగా, వారు పొందిన రుణానికి సంబంధించిన వాస్తవ సమాచారాన్ని అందించాలి, విఫలమైతే వారి నుండి మొత్తాలను చట్టబద్ధంగా రికవరీ చేసే నిబంధనలతో వ్యవసాయ కమిషనర్ మరియు డైరెక్టర్‌కు అధికారం ఉంటుంది. సహకార శాఖ డైరెక్టర్ సహకార సంఘాల రిజిస్ట్రార్ పీఏసీఎస్ వద్ద అందుబాటులో ఉన్న డేటా వాస్తవ సమాచారాన్ని ధృవీకరించడానికి ముందస్తు ఆడిట్ నమూనాను నిర్వహించాలి. దానిని వ్యవసాయ శాఖకు సమర్పించాలి.
ఫిర్యాదుల పరిష్కారానికి 30 రోజుల గడువు
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని, ఇందులో రైతులు తమ ఫిర్యాదులను ఐటీ పోర్టల్ లేదా మండల స్థాయిలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు 30 రోజుల గడువు విధించారు.