Registration Charges Hikes in Telangana: తెలంగాణలో త్వరలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆగస్టు 1 నుంచి వ్యవసాయం, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచడానికి భూముల మార్కెట్ విలువను సవరించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది.
2023 డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలి సారి భూముల విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతుంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుత మార్కెట్ విలువను అధ్యయనం చేయడానికి, తదనుగుణంగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను నిర్ణయించడానికి ఒక కార్యాచరణను ప్రారంభించింది. జూన్ 18న అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో (ఆర్‌డీఓ) సమావేశమైన తర్వాత దీనికి సంబంధించిన గ్రౌండ్‌వర్క్‌ను ఆ శాఖ ప్రారంభించనుంది.
(ఇది కూడా చదవండి: మీరు కోటీశ్వరులు కావడానికి టాప్-5 పెట్టుబడి పొదుపు పథకాలు ఇవే!)
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరించేందుకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దశలవారీగా విశ్లేషణ చేసిన అనంతరం కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను జూలై 1న నిర్ణయించనున్నారు. మండల, జిల్లా స్థాయిల్లో కమిటీల అధ్యయనం అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త మార్కెట్ విలువ అమల్లోకి తీసుకొని రావాలని చూస్తుంది. దీనికోసం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయితీ రాజ్, సర్వే శాఖల అధికారులతోనూ సమావేశాలు నిర్వహించనుంది.
జూలై 1న వెబ్‌సైట్‌లో సవరించిన మార్కెట్ విలువలను పోస్ట్ చేసిన తర్వాత, జూలై 20 వరకు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాల స్వీకారణ రిజిస్ట్రేషన్ శాఖ చేపట్టనుంది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి ప్రధాన కారణం.. మార్కెట్ విలువకు, భూముల వాస్తవ విక్రయ ధరకు మధ్య వ్యత్యాసం ఉండడమే అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని, అయితే ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, అమ్మకపు ధరకు భారీ వ్యత్యాసం ఉందని సమావేశంలో చెప్పినట్లు తెలిసింది.